పాకిస్థాన్ ఆటగాళ్ల కవ్వింపులు తనకు నచ్చలేదని, దాంతోనే వారిపై విరుచుకుపడ్డానని టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. కారణం లేకుండా తమ దగ్గరకు వచ్చి వాగ్వాదానికి దిగడం తనకు కోపం తెప్పించిందని, బ్యాట్‌తోనే వారికి బదులిచ్చాని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్-4 పోరులో సమష్టిగా రాణించిన భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.
ఈ టోర్నీలో పాకిస్థాన్‌ను భారత్ ఓడించడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ రోజు సాధారణంగానే ఉంది. పాకిస్థాన్ ఆటగాళ్లు కారణం లేకుండా మా దగ్గరకు వచ్చి కవ్వింపులకు దిగడం నాకు అస్సలు నచ్చలేదు. దాంతోనే నేను వారిపై బ్యాట్‌తో విరుచుకుపడ్డాను. జట్టు కోసం గెలవాలనుకున్నాను. శుభ్‌మన్ గిల్‌తో కలిసి స్కూల్ రోజుల నుంచి ఆడుతున్నా. కలిసి ఆడటం ఇద్దరికీ ఇష్టమే. ఈ రోజు జోడీగా మా సత్తా చూపించాలనుకున్నాం.
అనుకున్నట్లుగానే మా నుంచి అద్భుతమైన భాగస్వామ్యం వచ్చింది. శుభ్‌మన్ గిల్ ఆడిన తీరు నాకు బాగా నచ్చింది. ఎవరైనా ఇలా ఆడుతున్నారంటే అది జట్టు మద్దతు వల్లే సాధ్యమవుతోంది. టీమిండియా మేనేజ్‌మెంట్ నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించడం వల్లే నేను రాణించగలుగుతున్నాను. నేను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ఒకవేళ అది నా రోజు అయితే.. నా జట్టుకు విజయాన్ని అందిస్తాను.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.