టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు తన హాఫ్ సెంచరీని అంకితం చేస్తున్నట్లు టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. వరుసగా విఫలమైనా సరే తనకు అండగా నిలిచారని చెప్పాడు. మళ్లీ డకౌట్ అయినా జట్టు నుంచి తప్పించబోమని చెప్పారని పేర్కొన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో అభిషేక్ శర్మ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనా అతనికి టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది.
జింబాబ్వేతో గురువారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. బ్యాట్‌తోనే తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన అభిషేక్ శర్మ.. జట్టు సపోర్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'నా కంటే సహచర క్రికెటర్లకే నాపై నమ్మకం ఎక్కువగా ఉంది. హాఫ్ సెంచరీ చేశాక భావోద్వేగానికి గురయ్యా. అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించా. అయినా నా బెస్ట్ ఇంకా రాలేదు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ చాలా అద్భుతంగా ఉంది. మేం ఒక జట్టులా కాకుండా కుటుంబంలా ఉంటాం. అందుకే నా నుంచి బెస్ట్ గేమ్ రావాలని జట్టు అంతా కోరుకుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నా. నేను కూడా ఎదురు చూస్తున్నా.
టీ20 ప్రపంచకప్ ప్రారంభమయ్యే సమయానికి నా ఆరోగ్యం కూడా అంత బాలేదు. అంతకుముందు ఆసుపత్రిపాలయ్యా. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో దేశం కోసం తొలి మ్యాచ్ ఆడేటప్పుడు మంచి ఆరంభం దక్కాలని కోరుకున్నా. కానీ అలా జరగలేదు. అయినా సరే, జట్టు సభ్యుల నుంచి ఇప్పటికీ అదే మద్దతు లభిస్తోంది. మరీ ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యభాయ్ నాపై చాలా నమ్మకం ఉంచారు. ఇంకో మ్యాచ్ డకౌట్ అయినా సరే పక్కన పెట్టేది లేదని.. జట్టు కోసం విజయాలు అందించాలని చెప్పారు. జట్టుకు కీలకమైన ప్లేయర్‌గా నన్ను భావించారు. అందుకే, జింబాబ్వేపై హాఫ్ సెంచరీని నేను నా జట్టు సహచరులు, కోచ్, కెప్టెన్‌కు అంకితం చేశాం.'అని అభిషేక్ వెల్లడించాడు.