భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ బ్యాట్‌ను న్యూజిలాండ్ ఆటగాళ్లు చెక్ చేశారు. న్యూజిలాండ్ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ 10 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన అభిషేక్ శర్మ.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో వీర విహారం చేశాడు. భారత విజయం లాంఛనమైన అనంతరం పెవిలియన్ వైపు నడుస్తున్న అభిషేక్ శర్మ వద్దకు డెవాన్ కాన్వే వచ్చి అతని బ్యాట్ తీసుకొని పరిశీలించాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మతో ఏదో అనగా.. అతను నవ్వుతూ బదులిచ్చాడు. జాకోబ్ డఫ్ఫీ కూడా ఈ సంభాషణలో భాగమయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.

న్యూజిలాండ్ ఆటగాళ్లు బ్యాట్ చెక్ చేస్తుంటే..'బ్యాట్‌లో ఏం ఉందన్నా.. బౌండరీలు బాదే దమ్ము నాలో ఉంది'అని అభిషేక్ శర్మ అంటున్నాడని ఈ వీడియోకు క్యాప్షన్స్ ఇస్తున్నారు. ఈ సిరీస్‌లో అభిషేక్ శర్మ ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. తొలి టీ20లో 84 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. రెండో టీ20లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మూడో టీ20లో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అభిషేక్ శర్మ విధ్వంసంతో మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచిన టీమిండియా.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. నాలుగో టీ20 విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనుంది. టీ20 ప్రపంచకప్ ముందు అభిషేక్ శర్మ విధ్వంసం ప్రత్యర్థి జట్లను వణికిస్తోంది.