న్యూఢిల్లీ: టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మను బ్యాటింగ్‌లో ప్రమోట్ చేయడాన్ని మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ తప్పుబట్టాడు. నాలుగో స్థానంలో మెరుగ్గా రాణిస్తున్న ఆటగాడిని ఫస్ట్ డౌన్‌లో ఎందుకు ఆడించారో తనకు అర్థం కావడం లేదన్నాడు. ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో మూడో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ వర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 2 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం జియో సినిమాలో మాట్లాడిన అభిషేక్ నాయర్.. టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయాలను తప్పుబట్టాడు. 'టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మను వన్ డౌన్‌లో పంపించడం ఏంటో అర్థం కాలేదు.

ఫస్ట్ డౌన్‌కు సంజూ శాంసన్ సరిగ్గా సరిపోతాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అవసరమే లేదు. ప్రత్యర్థి జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉన్నాడు. పాల్ స్టిర్లింగ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. అయితే పేస్‌కు అనుకూలించే పిచ్‌పై బాల్ పెద్దగా టర్న్ అవ్వదు. కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిలక్ వర్మను ఫస్ట్ డౌన్‌లో ఆడించాల్సిన అవసరం కూడా ఏ మాత్రం లేదు. నాలుగో స్థానంలో అతను నిలకడగా రాణిస్తున్నాడు. అతన్ని అదే స్థానంలో బ్యాటింగ్ పంపించాలి.'అని అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తిలక్ వర్మ.. అద్భుత ప్రదర్శన కనబర్చాడు. నాలుగో స్థానంలో పరిస్థితులకు తగ్గట్లు రాణించాడు. దాంతో అతన్ని ఆసియాకప్ జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఐర్లాండ్ పర్యటనలో తొలి మ్యాచ్‌లో తిలక్ వర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. ఎదుర్కొన్న తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. బారీ మెక్‌కార్తీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కర్టీస్ కాంఫెర్(39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ దశలో 100 పరుగుల లోపే ఆలౌటయ్యేలా కనిపించిన ఐర్లాండ్‌ను ఈ ఇద్దరూ అసాధారణ బ్యాటింగ్‌తో ఆదుకున్నారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/24), ప్రసిధ్ కృష్ణ(2/32), రవి బిష్ణోయ్(2/23) రెండేసి వికెట్లతో సత్తా చాటగా... అర్ష్‌దీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 6.5 ఓవర్లలో 2 వికెట్లకు 47 పరుగులు చేయగా వర్షం అంతరాయం కలిగించింది. ఎంతకు వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చారు.