న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ మండిపడ్డాడు. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడాన్ని తప్పుబట్టాడు. రోహిత్ శర్మ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు.
పచ్చికతో కూడిన పిచ్ మీద ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్‌కు భారత బ్యాటర్లు ఎక్స్‌పోజ్ కావద్దనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని అభిప్రాయపడ్డాడు. న్యూస్ 18 ఛానెల్‌తో మాట్లాడిన ఫరూఖ్ ఇంజినీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

'టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. గ్రీన్ ట్రాక్‌పై ఆస్ట్రేలియా పేస్ అటాక్‌కు మన బ్యాటర్లు ఎక్స్‌పోజ్ కావద్దనే రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు. మహమ్మద్ షమీ, సిరాజ్ బౌలింగ్‌లో ప్రభావం చూపుతారని ఆశిస్తున్నా. ముందుగా బౌలింగ్ చేయడం బోల్డ్ నిర్ణయం.
టీమిండియా బ్యాటింగ్ చతేశ్వర్ పుజారా కీలకం కానున్నాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ రాణించడం కూడా ముఖ్యమే. టీమిండియా బ్యాటింగ్ లైనప్ బాగుంది. అంతేకాకుండా టీమ్ కాంబినేషన్ సమతూకంగా ఉంది'అని ఫరూఖ్ ఇంజినీర్ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం టీమిండియాకు నష్టం చేసింది. తొలి సెషన్‌లో పర్వాలేదనిపించిన భారత బౌలర్లు ఆ తర్వాత చేతులెత్తేసారు. పిచ్ కూడా పూర్తిగా బ్యాటింగ్ సహకరిస్తుండటంతో ఏం చేయలేకపోతున్నారు. ఇప్పటికే ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్టీవ్ స్మిత్ ఆ దిశగా కొనసాగుతున్నాడు. దాంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ భారీ స్కోర్ దిశగా నడుస్తోంది.
పిచ్‌ను అంచనా వేయడంలో టీమిండియా మేనేజ్‌మెంట్ విఫలమైంది. వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ను పక్కనపెట్టడం కూడా నష్టం చేసింది. రెండు నెలలపాటు ఐపీఎల్ ఆడి వచ్చిన భారత బౌలర్లు లాంగ్ స్పెల్స్ వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా కీలక మ్యాచ్‌లో పరిస్థితులన్నీ భారత్‌కు ప్రతికూలంగా మారాయి.