మిస్టర్ మంజ్రేకర్.. మీతో ఏకీభవించం.. అశ్విన్ ఓ లెజెండ్.. గాలికి పోయేదాన్ని..!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అనవసరమైన వ్యాఖ్యలతో తరుచూ వివాదాల్లో చిక్కుకునే ఈ మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్.. తాజాగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తక్కువ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అనవసర చర్చకు తెరలేపాడు. ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌ఇన్‌ఫోకు రాసిన కాలమ్‌లో అశ్విన్.. దిగ్గజ ఆటగాళ్ల జాబితాలోకి రాడని, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై 5 వికెట్ల ఘనతను ఎక్కువగా అందుకోలేకపోయాడని పేర్కొన్నాడు.
ఈ కథనంపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలికి పోయేదాన్ని తగిలించుకొని రచ్చచేయడం మంజ్రేకర్‌కు అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మంజ్రేకర్ కామెంట్స్‌ను మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా తప్పుబడుతున్నారు. దాంతో 'అశ్విన్ లెజెండరీ బౌలర్? కాదా? అనే చర్చ క్రికెట్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది.

ఏకీభవించను మంజ్రేకర్..
ఇక మంజ్రేకర్ వ్యాఖ్యలను తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ తప్పుబట్టాడు. మంజ్రేకర్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని స్పష్టం చేశాడు. అంతేకాకుండా టాప్ టీమ్స్‌పై అశ్విన్ ప్రదర్శనను ఓవరాల్‌గా చూడాలని మంజ్రేకర్‌ను కోరాడు. స్టాండప్ కమెడీయన్ సోరభ్ పంత్ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముకుంద్ ఈ కామెంట్స్ చేశాడు. 'సంజయ్ మంజ్రేకర్ రాసిన కథనాన్ని నేను చదివాను. అందులో లెజెండ్ ఆఫ్ ది గేమ్ గురించి అతను చేసిన కామెంట్స్‌ను నేను పూర్తిగా విభేదిస్తున్నాను. అశ్విన్ ఓ లెజెండరీ బౌలర్. ఎందుకంటే ఇప్పటికే అతను ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. సెనా దేశాలపై అతను 5 వికెట్ల ఘనత అందుకోలేదని నింద ఉన్నప్పటికీ.. తన బౌలింగ్‌తో జట్టు విజయాల్లో ప్రభావం చూపాడనే విషయన్ని మరవొద్దు. నా దృష్టిలో అతను ఓ లెజెండ్'అని ముకుంద్ చెప్పుకొచ్చాడు.

అశ్విన్ బెస్ట్..
ఇక ఈ డిబెట్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కూడా స్పందించాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ కన్నా అశ్విన్ ఎంతో నయమని అభిప్రాయపడ్డాడు. కుడిచేతి వాటం బ్యాటర్లకు బౌలింగ్ చేసినప్పుడు లయన్ లెగ్ సైడ్ ఎక్కువ పరుగులు ఇస్తాడని పేర్కొన్నాడు. 'నాథన్ లయన్‌తో పోలిస్తే అశ్వినే మెరుగని నా అభిప్రాయం. 2018 నుంచి లైయన్ స్ట్రైక్‌రేట్ గమనించండి. అతను కుడిచేతివాటం బ్యాటర్లకు బౌలింగ్ చేస్తుంటే ఆన్‌సైడ్ ఎక్కువ పరుగులు ఇస్తాడు. నిజానికి అలా జరగొద్దు. నిజమే, లయన్ మంచి బౌలరే. కానీ అశ్విన్ అంతకన్నా మెరుగైన బౌలర్' అని చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా బౌలింగ్ పటిష్టంగా ఉండటంతో బౌలర్లంతా వికెట్లు పంచుకుంటున్నారని, దాంతోనే అశ్విన్ 5 వికెట్ల ఘనతను అందుకోలేకపోయాడని స్పష్టం చేశాడు. అంత మాత్రానా అతను గొప్ప బౌలర్ కాదనడం బావ్యం కాదని మంజ్రేకర్‌కు చురకలంటించాడు.

నా ఓటు అశ్విన్‌కే..
ఇక చాపెల్ వ్యాఖ్యలతో పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ స్పందించాడు. అశ్విన్-లయన్‌లోలో భారత స్పిన్నరే బెస్ట్ అని చెప్పుకొచ్చాడు. ఇద్దరూ గొప్ప లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేస్తారని, కానీ వేరియషన్స్ విషయంలో అశ్విన్‌దే పై చేయని పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య భారీ తేడా లేకపోయినా.. వేరియషన్స్, బౌలింగ్ శైలి వంటి విషయాల్లో అశ్విన్‌కే కొంచెం అడ్వాంటేజ్ ఇస్తానని తెలిపాడు. అంతేకాకుండా అశ్విన్ బ్యాటింగ్ కూడా చేయగలడని, తానే కెప్టెన్ అయితే ఈ ఇద్దరిలో నుంచి అశ్విన్‌నే తీసుకుంటానని స్పష్టం చేశాడు. అంతేకాకుండా అశ్విన్ మూడు ఫార్మాట్లలో రాణించగలడని తెలిపాడు.

మంజ్రేకర్ వివరణ..
ఇక తన కథనం పట్ల వస్తున్న విమర్శల నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ట్విటర్ వేదికగా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. తన దృష్టిలో ఆల్‌టైమ్ గ్రేట్ అంటే.. క్రికెటర్‌కు ఇచ్చే అత్యున్నత ప్రశంస, గుర్తింపని తెలిపాడు. డాన్ బ్రాడ్ మన్, సోబెర్స్, గవాస్కర్, టెండూల్కర్, విరాట్ కోహ్లీ తదితరుల్లా అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఆ జాబితాలోకి అశ్విన్ రాలేదని పేర్కొన్నాడు. అయితే మంజ్రేకర్ తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతంలో జడేజాను పీసేస్ ఆటగాడు అంటూ అగౌరవ పరిచిన మంజ్రేకర్.. అతని చేత చివాట్లను కూడా తిన్నాడు. ఈ తరహా ప్రవర్తనతోనే బీసీసీఐ అతన్ని కామెంట్రీ ప్యానల్ నుంచి తప్పించింది. అయినా మంజ్రేకర్ తన ప్రవర్తనను మార్చుకోలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications