టీమిండియా మేనేజ్‌మెంట్ తీరుపై యువ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ తండ్రి, రంగనాథన్ ఈశ్వరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణ్ నాయర్ కోసం తన కొడుక్కి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్‌కు ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఓవల్ వేదికగా గురువారం ప్రారంభమైన ఆఖరి టెస్ట్‌లోనూ అభిమన్యు ఈశ్వరన్‌కు నిరాశే ఎదురైంది. మరోసారి టీమిండియా మేనేజ్‌మెంట్ కరుణ్ నాయర్‌కే అవకాశం ఇచ్చింది. తొలి మూడు టెస్ట్‌ల్లో తీవ్రంగా నిరాశపర్చినా.. ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా తీసుకుంది.
2022 బంగ్లాదేశ్ పర్యటన నుంచి టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న అభిమన్యు ఈశ్వరన్.. తాజా ఇంగ్లండ్ పర్యటనలోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అతనికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. అభిమన్యు ఈశ్వరన్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తుండటంపై అతని తండ్రి రంగనాథన్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేస్తున్నా తన కొడుక్కి అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

'అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం కోసం నేను రోజులు లెక్క పెట్టడం లేదు. ఏకంగా సంవత్సరాలనే లెక్కిస్తున్నాను. ఇప్పటికే మూడేళ్లు పూర్తయింది. ఒక ఆటగాడి బాధ్యత పరుగులు చేయడం. అభిమన్యు అది చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా-ఏ తరఫున రెండు మ్యాచ్‌ల్లో అభిమన్యు రాణించలేదని, దాంతోనే తుది జట్టులో అవకాశం దక్కలేదని కొందరు అన్నారు. దానికి పర్వలేదు కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు అభిమన్యు అద్భుతంగా ఆడిన సమయంలో కరుణ్ నాయర్ భారత జట్టులో లేడు. దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ వంటి టోర్నీలను కూడా కరుణ్ నాయర్ ఆడలేదు. అతనికి అవకాశం కూడా దక్కలేదు. గతేడాది నుంచి ఇప్పటి వరకు అభిమన్యు దేశవాళీ క్రికెట్‌లో 864 పరుగులు చేశాడు.
ఆటగాళ్లను ఎలా పోల్చుతారో నాకు అర్థం కావడం లేదు. కరుణ్ నాయర్‌కు అవకాశం ఇచ్చారు. మంచిదే.. అతను దేశవాళీ క్రికెట్‌లో 800 ప్లస్ రన్స్ చేశాడు. సెలెక్టర్లు అతనిపై నమ్మకం ఉంచారు. అదే సమయంలో నా కొడుకు కాస్త నిరాశగా కనిపిస్తున్నాడు. అలా జరగడం సహజం. కొందరు ఆటగాళ్లను ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్ట్ టీమ్‌లోకి తీసుకున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. టెస్ట్ ఫార్మాట్‌కు జట్టు ఎంపిక చేస్తున్నప్పుడు ఐపీఎల్ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకోకూడదు. టెస్ట్ టీమ్ ఎంపికకు రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల ప్రదర్శనలే ప్రాతిపదిక కావాలి.'అని రంగనాథన్ ఈశ్వరన్ అన్నారు.
దేశవాళీ క్రికెట్‌లో అభిమన్యు ఈశ్వరన్ మెరుగైన ప్రదర్శన చేశాడు. లాస్ట్ సీజన్‌లో అతను 127*, 191, 116, 19, 157*, 13, 4, 200*, 72, 65 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అభిమన్యు ఈశ్వరన్.. 48.70 సగటుతో 7841 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలతో పాటు 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022లో తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్న అభిమన్యు ఈశ్వరన్.. అరంగేట్రం కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో భారత్ తరఫున 15 మంది ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.