
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ ప్లేయరేనని, ఫామ్ కోల్పోవడం తాత్కలికమేనని తెలిపాడు. ఆట విషయంలో అతనికి ఒకరు చెప్పాల్సిన పనిలేదన్నాడు. ఆసియా కప్ సమీపిస్తున్న నేపథ్యంలో చర్చంతా విరాట్ కోహ్లీ ఫామ్‌పైనే సాగుతోంది. సుదీర్ఘ విరామం అనంతరం ఆసియా కప్ బరిలోకి దిగుతున్న విరాట్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని ఏబీ డివిలియర్స్ తెలిపాడు.
ఓ చానెల్‌కు ఇంటర్వ్యూలో ఏబీడీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఫామ్ కోల్పోవడం తాత్కాలికం. క్లాస్ ఆట శాశ్వతం. విరాట్ ప్రపంచ స్థాయి ఆటగాడు. విరాట్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటా. మేమిద్దరం మంచి స్నేహితులం. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అతనికి నా అవసరం ఏమీ లేదు. తప్పకుండా ఫామ్ అందుకుంటాడు. ఇక టీ20 క్రికెట్ లీగ్‌లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది.
అయితే ఇతర ఫార్మాట్లపై ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయా ఫార్మాట్లకు తగినంత సమయం కేటాయింపు జరుగుతుంది. ఆదాయం సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టీ20 ఫార్మాట్‌ను వృద్ధి చేయడంలో అంతర్జాతీయంగా ఫ్రాంచైజీలు కీలక పాత్ర పోషిస్తాయి'అని ఏబీడీ చెప్పుకొచ్చాడు.
ఇటీవల సూర్యకుమార్ యాదవ్‌ను ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ తనతో పోల్చడంపైనా డివిలియర్స్ స్పందించాడు. 'సూర్యకుమార్ యాదవ్ చాలా బాగా ఆడుతున్నాడు. అతని బ్యాటింగ్ చూస్తూ ఎంజాయ్ చేశా. ప్రతీ ఆటగాడు నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఐపీఎల్‌లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ గౌరవంగానే భావిస్తా. ఇప్పటికీ ఫ్రాంచైజీతో అనుబంధం ఉంది. వచ్చే సీజన్‌కు సంబంధించి బెంగళూరు హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఉండటం గొప్ప గౌరవం'అని ఏబీడీ చెప్పుకొచ్చాడు.