న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేదా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ టాప్ స్కోరర్‌గా నిలుస్తారని సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా శనివారం భారత్-పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఏబీ డివిలియర్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'ఆసియాకప్‌లో నా ఫేవరేట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్. శ్రీలంక, ఇతర ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం నేను అంతగా చూడలేదు. పరుగులు చేసే విషయంలో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ భిన్నమైన ఆటగాళ్లు. ఈ ఇద్దరూ 130-150 పరుగులు చేస్తారు. ఈ ఇద్దరూ కాకుండా మరే ఆటగాడు ఈ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిస్తే నేను షాకవుతా.

షాహిన్ షా అఫ్రిది పాకిస్థాన్‌కు కీలకమైన ఆటగాడు. గతంలో మాదిరి అతను రిథమ్‌లో కనిపించడం లేదు. అతను ఒత్తిడిలో ఉన్నాడో లేక గాయాల వల్ల ఇబ్బంది పడుతున్నాడో తెలియదు కానీ అతను తన శక్తిని ఆదా చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. బిగ్ మ్యాచ్‌ల కోసం రిథమ్ అందుకునే ప్రయత్నం చేస్తుండవచ్చు.'అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
ఆసియాకప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(151), ఇఫ్తికర్ అహ్మద్(109 నాటౌట్) భారీ సెంచరీలతో చెలరేగారు. భారత్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని పాకిస్థాన్ భావిస్తోంది.
ఇక ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతుండటంతో భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఒక్క వన్డే మ్యాచ్ కూడా జరగలేదు. దాంతోనే ఆసియాకప్ హైఓల్టేజ్ పోరులో ఎవరు? ఫేవరేట్ అనేది చెప్పడం కష్టంగా మారింది. గతంలో భారత బ్యాటర్లు, పాకిస్థాన్ బౌలర్ల మధ్యనే పోరు ఉండేది.
అయితే ఈ సారి కూడా అదే రిపీట్ కానుంది. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీష్ రౌఫ్‌ల బౌలింగ్.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ సత్తాకు పరీక్షగా నిలవనుంది. టీమిండియాలో నెంబర్ 4లో ఆడనున్న శ్రేయస్ అయ్యర్ కీలకం కానుండగా.. పాకిస్థాన్‌లో షాహిన్ షా అఫ్రిది బౌలింగ్ ప్రదర్శనపై ఆ జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
బ్యాటింగ్‌లో డెప్త్ ఉండటం పాకిస్థాన్‌కు కలిసొచ్చే అంశం కాగా.. భారత్‌కు బలహీనతగా మారింది. రవీంద్ర జడేజా తర్వాత బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన టెయిలెండర్లు భారత జట్టులో లేరు.