
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి తండ్రి అయ్యాడు. నవంబర్ 11న అతని సతీమణి డానియెల్లీ ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని డివిలియర్స్ ఈ రోజే(శుక్రవారమే) సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. డివిలియర్స్, డానియెల్లీ దంపతులకు యెంటే మూడో సంతానం.
2013లో డివిలియర్స్, డానియెల్లీ వివాహం జరగగా. ఈ దంపతులకు అబ్రహం డివిలియర్స్, జాన్ రిచర్డ్ డివిలియర్స్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అబ్రహం 2017లో పుట్టగా.. జాన్ రిచర్డ్ 2019లో జన్మించాడు. ఇప్పుడు ఆడ పిల్ల పుట్టడంతో డివిలియర్స్ దంపతులు మురిసిపోతున్నారు. తన భార్య, కూతురితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఏబీడీ.. తమ పాపకు యెంటే డివిలియర్స్ అని పేరు పెట్టినట్లు తెలిపాడు.
'11-11-2020 రోజున మేం ఓ అందమైన బేబీ గర్ల్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. ఆ దేవుణి ఆశిస్సులతో మా కుటుంబంలోని యెంటే డివిలియర్స్ చేరింది.'అని క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. ఇక డివిలియర్స్ దంపతులకు సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ 454 రన్స్ చేశాడు. ఆర్‌సీబీ తరఫున పడిక్కల్, కోహ్లీ తర్వాత ఏబీడీవే ఎక్కువ రన్స్. 2016 తర్వాత ఐపీఎల్ ప్లేఆఫ్ చేరిన ఆర్సీబీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. డివిలియర్స్ ఫ్రెండ్ అయిన విరాట్ కోహ్లి కూడా త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే.