టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఫేవరేట్ క్రికెటర్ అని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తెలిపాడు. ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్) 2025లో ఆడుతున్న ఆర్యవీర్.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. తండ్రిలానే విధ్వంసకరంగా ఆడే ఆర్యవీర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. దాంతో అతను రూ. 8 లక్షల భారీ ధర పలికాడు.
తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో జరిపిన ఇంటరాక్షన్‌లో ఈ 17 ఏళ్ల యువ క్రికెటర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఒకర్ని ఎంచుకోవాలనే సరదా గేమ్‌లో ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలో ఒకర్ని ఎంచుకోమనగా.. ఆర్యవీర్ గిల్ పేరు చెప్పాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాల పేర్లు సూచించినప్పుడు కూడా గిల్‌కే ఆర్యవీర్ ఓటేసాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..? మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మల కంటే తనకు శుభ్‌మన్ గిల్ గొప్ప అని చెప్పాడు. భారత్‌కు ధోనీ మూడు ఐసీసీ టైటిళ్లు అందించగా.. రోహిత్ సారథ్యంలో రెండు టైటిళ్లు వచ్చాయి. అయినా ఆర్యవీర్.. ఇప్పుడే సారథిగా కెరీర్ ప్రారంభించిన శుభ్‌మన్ గిల్‌కు ఓటేయడం గమనార్హం. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్‌ల కంటే కూడా గిల్ గొప్పవాడని చెప్పాడు.
విరాట్ కోహ్లీతో పోలిక వచ్చినప్పుడు మాత్రం గిల్ పేరును పక్కన పెట్టాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలలో ఒకర్ని ఎంచుకోమనగా.. ఆర్యవీర్.. కోహ్లీకే ఓటేసాడు. తన తండ్రి ఫేవరేట్ సచిన్ టెండూల్కర్ అయినప్పటికీ.. ఈ తరంలో కోహ్లీనే అత్యుత్తమ క్రికెటర్ అని చెప్పాడు.