
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ తెరలేసింది. ఆస్ట్రేలియా వేదికగా శ్రీలంక, నమీబియా మ్యాచ్‌తో ధనాధన్ టోర్నీ ప్రారంభమైంది. ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతుండగా.. అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 ప్రారంభంకానుంది. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే జట్లన్నీ ఆస్ట్రేలియాకు చేరి సన్నహకాలు మొదలుపెట్టాయి. ఇక 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. రెండో సారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా సన్నదమవుతోంది. అయితే.. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవడం లోటుగానే కనిపిస్తోంది.
ముఖ్యంగా.. బుమ్రా లేని భారత పేస్ అటాక్ ఎలా ఉంటుందోనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా పాక్ మాజీ ఆటగాడు ఆకిబ్ జావెద్ స్పందించాడు. ఆ లోటు ఉన్నప్పటికీ.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటను మార్చగల సత్తా ఉన్న ఆటగాడు ఆ జట్టులో ఉన్నాడని వివరించాడు.
'బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్ దళం ఇబ్బందిపడుతోంది. షాహీన్ షా ఆఫ్రిది, రవూఫ్ లాంటి ఇంపాక్ట్ బౌలర్లు వారికి లేరు. ఇంపాక్ట్ బౌలర్ ప్రత్యర్థి బ్యాటర్లపై చాలా ఒత్తిడి తీసుకువస్తాడు. ప్రస్తుతం వారి వద్ద మీడియం పేస్ బౌలర్లు మాత్రమే ఉన్నారు. అయితే.. ఏ సమయంలోనైనా ఆటను మార్చగల శక్తి హార్దిక్ పాండ్యాకు ఉంది' అంటూ జావెద్ పేర్కొన్నాడు. ఇక గాయాల కారణంగా జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను, బుమ్రా స్థానంలో షమీని ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది. ఈ నెల 23న ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.