టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కేఎల్ రాహుల్ విరోచిత శతకంతో టీమిండియాను ఆదుకున్న విషయం తెలిసిందే. 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 పరుగులతో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
121 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగిన భారత్‌ను విరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. టెయిలెండర్ల సాయంతో శతకం సాధించడంతో పాటు జట్టుకు 245 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు.

సౌతాఫ్రికా గడ్డపై కేఎల్ రాహుల్ చరిత్రలో నిలిచిపోయే శతకాన్ని సాధించాడని గవాస్కర్ కొనియాడగా.. గర్వించే శతకాన్ని అత్యంత అరుదైన ఆటగాడైన రాహుల్ సాధించాడని హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. అభిమానులు.. రాహుల్ రికార్డులను షేర్ చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఆకాశ్ చోప్రా.. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు విరాట్ కోహ్లీకి చురకలంటించాడు.
'కేఎల్ రాహుల్ సాధించిన ఈ శతకాన్ని చరిత్ర మరిచిపోదు. అతనో ఆపద్బాంధవుడు'అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
'చరిత్ర గుర్తుపెట్టుకోవడం అనేది బ్రాడ్ కాస్టర్‌తో పాటు సోషల్ మీడియా వారియర్స్ చేసే పోస్ట్‌లపై ఆధారపడి ఉంది. రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ ఎన్నిసార్లు చూపిస్తారనేదానితో ఈ విషయం ముడిపడి ఉంది.'అని ఆకాశ్ చోప్రా ఆసక్తికర కామెంట్ చేశాడు. పరోక్షంగా అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు చురకలంటించాడు.
208/8 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా.. కేఎల్ రాహుల్(137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101) మెరుపు శతకం పూర్తయిన తర్వాత 245 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్‌తో 9వ వికెట్‌కు 47 పరుగులు జోడించిన రాహుల్.. చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
వేగంగా పరుగులు చేసిన రాహుల్.. సిక్సర్‌తో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. భారత బ్యాటర్లలో రాహుల్ తర్వాత విరాట్ కోహ్లీ(64 బంతుల్లో 5 ఫోర్లతో 38), శ్రేయస్ అయ్యర్(50 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), శార్దూల్ ఠాకూర్(33 బంతుల్లో 3 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలోకగిసో రబడా(5/59), నండ్రే బర్గర్(3/50)కు తోడుగా మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ పడగొట్టాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ ఆగిపోయే సమయానికి 66 ఓవర్లలో 5 వికెట్లకు 256 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్(211 బంతుల్లో 23 ఫోర్లతో 140 బ్యాటింగ్) శతకంతో చెలరేగగా.. డేవిడ్ బెడింగ్‌హమ్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎల్గర్‌తో పాటు మార్కో జాన్సెన్(3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టాడు.