సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో గాయపడిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తదుపరి మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. మెడనొప్పితో ఆసుపత్రి పాలైన శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నిద్రలేమి సమస్య కారణంగానే శుభ్‌మన్ గిల్ మెడ నరాలు పట్టేసాయని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. మెడనొప్పితోనే బ్యాటింగ్‌కు దిగడంతో నొప్పి తీవ్రమైంది. 24 గంటల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శుభ్‌మన్ గిల్.. టీమిండియాతో కలిసి గౌహతికి వెళ్లాడు. కానీ రెండో టెస్ట్ నుంచి అతనికి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అతని స్థానంలో బరిలోకి దిగే ఆటగాడు? ఎవరా? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌లో ఒకరు బరిలోకి దిగనున్నారు. కానీ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.

'శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్ ఆడుతాడా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ అతను దూరమైతే.. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఆడించాలి. అయితే ఇప్పటికే జట్టును ప్రకటించారు. అతన్ని ఎలా తీసుకుంటారనే ప్రశ్న రావచ్చు. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ లెఫ్టార్మ్ బ్యాటర్లు. ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని తీసుకున్నా.. ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లువుతారు. ఇది ఏ మాత్రం సమంజసం కాదు.
అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్‌ల రూపంలో ప్రత్యామ్నాయం ఉన్నా.. రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతను భారత్ ఏ తరఫున వన్డేల్లో పరుగులు రాబడుతున్నాడు. కానీ అతనికి భారత్ ఏ తరఫున రెడ్‌బాల్ క్రికెట్‌లో అవకాశం దక్కడం లేదు. రుతురాజ్, రంజీ, దులీప్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా తరఫున 2024లో చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం అతనికి దక్కలేదు. కానీ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. సెప్టెంబర్ జరిగిన దులీప్ ట్రోఫీలో 184 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలతో పాటు ఒక శతకం నమోదు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న అనధికార వన్డే సిరీస్ ఆడుతున్నాడు.