Aakash Chopra:వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ ఇచ్చిన బాధ్యతలను విరాట్ కోహ్లీ సక్రమంగా నిర్వర్తించాడని, ఓ ప్లేయర్‌గా జట్టు కోసం చేయాల్సిందలా చేశాడని కొనియాడాడు. కానీ కొంతమంది పనిగట్టుకొని విరాట్ కోహ్లీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 765 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా గెలుచుకున్నాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీ చేసిన విరాట్.. ఆసీస్‌తో ఫైనల్లో హాఫ్ సెంచరీ బాదాడు.

అయితే విరాట్ కోహ్లీ వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడాడని, స్వార్థపూరితంగా బ్యాటింగ్ చేశాడని కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. అతని స్లో బ్యాటింగ్ జట్టుకు నష్టం చేసిందని ఆరోపించారు. ఈ కామెంట్లపై ఆకాశ్ చోప్రా ఘాటుగా స్పందించాడు. సోషల్ మీడియా అనుమతిస్తుండటంతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
జట్టు విజయం కోసం తన వంతుగా చేయాల్సిందల్లా చేసిన విరాట్ కోహ్లీని విమర్శించేందుకు సిగ్గుండాలన్నాడు. 'విరాట్ కోహ్లీ ప్రతీ మ్యాచ్‌లో పరుగులు చేశాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా తన బ్యాటింగ్‌తో అండగా నిలిచాడు. ఒక ఆటగాడు ఇంతకంటే ఏం చేయగలడు..? జట్టు విజయం కోసం కావాల్సిందల్లా విరాట్ చేశాడు.
అయినా అతన్ని అర్థం పర్థం లేని మాటలతో విమర్శిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ మాటలు చలామణి అవుతున్నాయి.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శనతో వరుసగా 10 విజయాలు సాధించిన టీమిండియా.. కీలక ఫైనల్లో మాత్రం తడబడింది. ఆస్ట్రేలియాతో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.