టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్‌లో ఎన్ని ఆఫర్లు వచ్చినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టును కోహ్లీ వీడలేదని గుర్తు చేశాడు. ఆ జట్టుకు విధేయుడిగా ఉన్నాడని ప్రశంసించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు జట్లు మారుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును వీడుతున్నారని, ఈ ముగ్గురు కెప్టెన్సీ అవకాశాల కోసం ఇతర జట్లలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి ఫ్రాంచైజీలు రోహిత్ శర్మ కోసం రూ. 50 కోట్ల ప్రైజ్‌మనీ సిద్దం చేసుకున్నాయని, అతను వేలంలోకి వస్తే ఆల్‌టైమ్ రికార్డు ధర పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఐపీఎల్ జర్నీ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్ని ఆఫర్లు వచ్చినా.. జట్టును వదల్లేదని, ఇప్పుడు రూ. 100 కోట్లు ఇచ్చినా ఆర్‌సీబీని వీడడని తెలిపాడు. 'విరాట్ కోహ్లీ ఓటమిని ఏ మాత్రం సహించడు. కానీ అతను ఇప్పటికీ ఆర్‌సీబీతోనే ఉన్నాడు.
ఎందుకంటే ఆ జట్టుతో అతని అనుబంధం అలా ఉంది. లాయల్టీ అంటే రాయల్టీ. ఐపీఎల్‌లో అతనికి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఏనాడు ఆర్‌సీబీతో ఉన్న బంధాన్ని తెంచుకోలేదు. అతను ఎప్పుడూ ఆర్‌సీబీకి విధేయుడిగానే ఉన్నాడు. అదే అతను ఏంటో తెలియజేస్తోంది.
అరంగేట్ర ఐపీఎల్ 2008 సీజన్‌లో ఆర్‌సీబీలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. అప్పటి నుంచి ఆ జట్టుకే ఆడుతున్నాడు. జట్టు క్షేమం కోసం ముందుండే కోహ్లీ... ఐపీఎల్ 2022 మెగా వేలం సందర్భంగా తన ప్రైజ్‌ను కూడా తగ్గించుకున్నాడు. ఒకే జట్టు తరఫున అత్యధిక సీజన్లు ఆడిన ఏకైక ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం.
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు ఫైనల్ చేరిన ఆర్‌సీబీ.. ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. ఇదొక్కటే కోహ్లీకి తీరని లోటుగా మిగిలిపోయింది.