సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే టీమిండియా.. శ్రీలంక గడ్డపై సుదీర్ఘ కాలం తర్వాత వన్డే సిరీస్ కోల్పోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సొంతగడ్డపై క్లీన్ స్వీప్‌కు గురైంది.
దాంతో అప్‌కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గౌతమ్ గంభీర్‌కు అగ్ని పరీక్షని, ఈ సిరీస్‌లోనూ టీమిండియా ఓడిపోతే అతనిపై వేటు పడటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి గంభీర్‌ను తప్పించి వైట్‌బాల్, రెడ్ బాల్ ఫార్మాట్లకు సపరేట్ కోచ్‌లను నియమిస్తారనే పుకారు సోషల్ మీడియా వేదికగా జోరుగా షికారు చేస్తోంది.

అయితే ఈ వాదనను టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. ఇంత కన్నా బుద్ది తక్కువ నిర్ణయం మరొకటి ఉండదని చెప్పాడు. ఆటగాళ్లు రాణించనప్పుడు కోచ్‌లు చేసేది ఏం ఉండదని తన యూట్యూబ్ చానెల్‌లో వెల్లడించాడు. 'గౌతమ్ గంభీర్‌తో 6 గంటల పాటు చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. అతనొక్కడితోనే కాదు కెప్టెన్ కూడా ఉన్నాడని అంటున్నారు.
ఈ సుదీర్ఘ చర్చలో ఎక్కడ తప్పులు జరిగాయి.. ఇలాంటి పిచ్‌లు ఎందుకు సిద్దం చేశారు? ఆటగాళ్లు ఎందుకు ఇలా విఫలమయ్యారనే విషయాలు మాట్లాడుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. నా దృష్టిలో ఇది పనికిరాని పుకారు. ఇప్పుడే కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌పై పనిగట్టుకొని పుట్టించిన పుకారు. ఆటగాళ్లు బాగా రాణించకపోతే.. కోచ్‌ను మార్చినా.. ఫార్మాట్‌కో కోచ్‌ను తీసుకొచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరాలంటే.. ఈ సిరీస్‌ను టీమిండియా 4-0తో గెలవాలి.
న్యూజిలాండ్ చేతిలో 0-3తో క్లీన్ స్వీప్ గురైన తర్వాత బీసీసీఐ సమీక్ష నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ముంబై టెస్ట్‌లో ర్యాంక్ టర్నర్ వికెట్ ఉపయోగించడంతో పాటు జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం, గంభీర్ కోచింగ్ స్టైల్‌పై సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రచారం జరిగింది. ఈ సమావేశానికి గంభీర్ వర్చువల్‌గా హాజరయ్యాడని, ఈ సిరీస్ సందర్భంగా టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలపై బీసీసీఐ వివరణ కోరినట్లు వార్తలు వచ్చాయి.