ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వీడుతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అతను వేలంలోకి వస్తే కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు కూడా ప్రకటించాయి. రోహిత్ శర్మ కోసమే కొన్ని ఫ్రాంచైజీలు రూ. 50 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యంపై టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లేనని చెప్పుకొచ్చాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా రోహిత్ శర్మ గురించి మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ముంబై ఇండియన్స్‌తో కొనసాగడం హిట్‌మ్యాన్‌కు ఇష్టం లేదని తెలిపాడు.

'రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తో ఉంటాడా? వీడుతాడా? అనేది పెద్ద ప్రశ్న. నేనైతే అతను ఉండడనే అనుకుంటున్నాను. మరోవైపు రోహిత్ శర్మ మూడేళ్ల పాటు ఆడగలిగితేనే జట్టులో రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం ఇది వర్తించదు. సీఎస్‌కేది వేరే కథ. కానీ ముంబై ఇండియన్స్ పరిస్థితి వేరు.
ఇక్కడ రోహిత్ శర్మనే స్వయంగా వెళ్లిపోవచ్చు. లేదా ముంబై ఇండియన్సే వదిలేయవచ్చు. ఇందులో ఏదైనా జరగొచ్చు. రోహిత్ మాత్రం ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతాడని మాత్రం నేను అనుకోవడం లేదు. నా వద్ద స్పష్టమైన సమాచారం ఏం లేదు. కానీ ముంబై ఇండియన్స్ అతన్ని వదిలేస్తుందని అనుకుంటున్నాను.
వేలంలో రోహిత్‌ను ఇతర జట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ముంబై ఇండియన్స్‌తో హిట్ మ్యాన్ ప్రయాణం ముగిసిందని నేను భావిస్తున్నాను.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్ తమ సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించిన విషయం తెలిసిందే. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని, గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రాన్సఫర్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు జట్టు బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ నిర్ణయంపై జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో పాటు అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రోహిత్ అభిమానులు అయితే హార్దిక్ పాండ్యాను దారుణంగా ట్రోల్ చేశారు. రోహిత్ శర్మ కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ముంబై ఇండియన్స్ రెండు వర్గాలుగా విడిపోయిందనే ప్రచారం కూడా జోరుగా సాగింది.