న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన చిన్న పనితో తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే అశ్విన్ సవాల్ చేయడం చర్చనీయాంశమైందని, ఈ ఒక్క పనితో టీఎన్‌పీఎల్‌కు వరల్డ్ లెవెల్ క్రేజ్ లభించిందన్నాడు.
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దిండిగల్ డ్రాగాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అశ్విన్.. ఓ వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే సవాల్ చేసిన విషయం తెలిసిందే. బాల్సీ ట్రిచీ జట్టుతో గత బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్ రాజ్‌కుమార్‌ను అశ్విన్ కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. అంపైర్ కూడా ఔటిచ్చాడు.

కానీ రాజ్‌కుమార్ రివ్యూ తీసుకోగా.. రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి బ్యాట్‌కు తాకలేదని నాటౌట్ ఇచ్చాడు. కానీ అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తాకినట్లు స్పైక్ కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం నాటౌటిచ్చాడు. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అశ్విన్.. థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే సవాల్ చేస్తూ రివ్యూ తీసుకున్నాడు.
దాంతో మరోసారి థర్డ్ అంపైర్ రిప్లేలను పరిశీలించి నాటౌటిచ్చాడు. అల్ట్రా ఎడ్జ్‌లోని స్పైక్.. బ్యాట్ నేలకు తాకడంతో వచ్చిందని వివరణ ఇచ్చాడు. క్రికెట్‌లో ఇలా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేయడం అత్యంత అరుదై. దాంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ క్రమంలోనే టీఎన్‌పీఎల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా వెల్లడించాడు. 'అశ్విన్ అన్న చేసిన చిన్నపని టీఎన్‌పీఎల్‌ను వరల్డ్ మ్యాప్‌లో నిలబెట్టింది. అతను అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ తీసాడు. మరో వికెట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. దాంతో అశ్విన్‌తో పాటు అంతా సంతోషం వ్యక్తం చేశారు.
కానీ బ్యాటర్ రివ్యూ తీసుకోగో.. థర్డ్ అంపైర్ స్మార్ట్‌గా అన్ని ప్రొటోకాల్స్ పాటిస్తూ.. అన్ని కోణాల్లో పరిశీలించి.. బ్యాట్‌కు బంతి తాకలేదని చెప్పాడు. అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్ వచ్చే సమయానికి బంతి, బ్యాట్ దగ్గరకు రాలేదన్నాడు. బ్యాట్ నేలకు కొట్టడంతో స్పైక్ వచ్చిందని వివరణ ఇచ్చాడు. థర్డ్ అంపైర్ పనితీరు చాలా అద్భుతంగా ఉంది.
అశ్విన్ మాత్రం థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ రివ్యూ తీసుకున్నాడు. టీఎన్‌పీఎల్ అధికారులు కూడా అశ్విన్ రివ్యూను అనుమతించారు. వాస్తవానికి ఇలా రెండోసారి రివ్యూ తీసుకునే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే 15 సెకండ్స్‌లోనే రివ్యూ తీసుకోవాలి. రివ్యూ తీసుకున్న తర్వాత అంపైర్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
మళ్లీ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. అతన్నే సమీక్ష చేయమనడం ఏ మాత్రం భావ్యం కాదు. అంతేకాకుండా దీని వల్ల చాలా సమయం వృథా అవుతుంది.'అని ఆకాశ్ చోప్రా చెప్పకొచ్చాడు.