
ముంబై: ఐపీఎల్-2022 సీజన్‌లో టీమిండియా ఆల్‌రౌండర్, చెన్నై సూపర్‌కింగ్స్ మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో చెన్నై సారథ్య బాధ్యతలు అందుకున్న జడేజా.. కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. దాంతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తేలిపోయాడు. ఈ సీజన్‌లో 116 పరుగులు మాత్రమే చేసిన జడేజా.. బౌలింగ్‌లో 5 వికెట్లు మాత్రమే తీసాడు. ఇక కెప్టెన్‌గా జట్టుకు రెండు విజయాలు మాత్రమే అందించాడు. దాంతో తీవ్ర ఒత్తిడికి గురైన అతను చివరికి సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. జట్టుకూ దూరమయ్యాడు. చెన్నై మేనేజ్‌మెంట్‌తో మనస్పర్థలు రావడంతోనే జడేజా దూరమయ్యాడని ఓ వైపు ప్రచారం జరుగుతున్నా.. మరోవైపు ఆ టీమ్ మాత్రం అలాంటిదేం లేదని స్పష్టం చేస్తోంది.
జడేజా గందరగోళ కెప్టెన్సీతో పాటు కీలక ఆటగాళ్లు గాయాలు దూరమవడంతో చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానంలో నిలిచి ఈ సీజన్‌ను ముగించింది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'రవీంద్ర జడేజా విషయంలో ఎన్నెన్నో ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. ఆఖరి మ్యాచ్‌లకు అతడు అందుబాటులో లేడు. అంతకుముందే కెప్టెన్సీ వదిలేశాడు. చెన్నై అతన్ని రూ. 16 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, ఇటీవలి పరిణామాలు చూస్తుంటే వచ్చే ఏడాది జడేజా కెప్టెన్‌గా ఉండడని స్పష్టంగా తెలుస్తోంది. ఎంఎస్ ధోని సైతం.. కెప్టెన్సీ జడ్డూ ఆటపై తీవ్ర ప్రభావం చూపిందని స్పష్టం చేశాడు. అయితే, తమ జట్టులో అంతాబాగానే ఉందని సీఎస్‌కే వర్గాలు అంటున్నాయి. కానీ ఆఖరి వరకు ఏమి జరుగుతుందో చెప్పలేము.
ఒకవేళ సీఎస్‌కే జడేజాను రిలీజ్ చేస్తే వారికి 16 కోట్లు మిగులుతాయేమో కానీ.. అలాంటి ఆటగాడు మాత్రం వారికి ఎప్పటికీ దొరకడు. డ్వేన్ బ్రావోను సీఎస్‌కు ఇంకెన్నాళ్లు కొనసాగిస్తుంది? బౌలర్‌గా తను మరో సీజన్‌లోనూ రాణించగలడేమో.. కానీ అతడి కోసం 4.4 కోట్లు ఖర్చు చేశారు. అతడు రోజురోజుకూ యువకుడు కావడం లేదన్న విషయాన్ని ఫ్రాంఛైజీ గమనించాలి. అతడి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుంది'' అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.