
న్యూఢిల్లీ: సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు సంబంధించిన ఓ విషయాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. సాధారణంగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మైదానంలోకి వస్తుంటే భారత అభిమానులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారని, కానీ ఏబీడీకి కూడా అదే రీతిలో స్వాగతం లభించడం చూసి ఆశ్చర్యపోయానన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
భారత్- సౌతాఫ్రికా మధ్య 2015లో ధర్మశాల జరిగిన వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుందన్నాడు. '2015 సౌతాఫ్రికా భారత పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్‌కు భారత అభిమానులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి దృశ్యాలను భారత స్టార్స్ అయిన విరాట్ కోహ్లీ, ధోనీ,సచిన్ , రోహిత్ మైదానంలోకి వస్తున్నప్పుడు చూస్తాం. కానీ ఏబీడీని కూడా భారత ఆటగాళ్లలో ఒకడిగా భావించిన ఫ్యాన్స్ లేచి నిలబడ్డారు. ఈ సన్నివేశాన్ని నేనెప్పుడు మరిచిపోను'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

ఆ పర్యటనలో భాగంగా జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఏబీ డివిలియర్స్ రెండు సెంచరీలతో చెలరేగాడు. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో శతకం(119) సాధించగానే మైదానమంతా.. ఏబీడీ.. ఏబీడీ అనే నామస్మరణతో మారుమోగింది. ఐపీఎల్‌తో భారత అభిమానులకు మరింత చేరువైన ఏబీడీ.. ప్రతీ సీజన్‌లో తనదైన ఆటతో అలరిస్తున్నాడు. భారత్ దేశంలో అత్యంతగా అభిమానించే విదేశీ ఆటగాడు ఏబీడీనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతనికి దేశంలో ఎంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే... భారత్ పౌరసత్వం తీసుకొని టీమిండియాకు ఆడాలని కోరెంత అభిమాన గణం ఉంది.
అయితే 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఏబీడీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ అతను దుమ్మురేపాడు. ఇక టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో సౌతాఫ్రికా టీమ్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తాడని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. అతనితో సఫారీ టీమ్ చేసి చర్చలు విఫలమయ్యాయి. రిటైర్మెంట్ వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని ఏబీడీ స్పష్టం చేశాడు.