Aakash Chopra: ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సొంత గూటికి చేరుతున్నాడనే వార్తలపై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. కెప్టెన్సీ లేకుండా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళ్లడం తెలివి తక్కువ నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. రెండు సార్లు ఫైనల్ చేర్చిన గుజరాత్ టైటాన్స్‌ను వదిలేసి హార్దిక్.. ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లడం వినడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాడని చెప్పాడు.
ఇక హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడి తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ గూటికి చేరుతున్నాడనే వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. క్యాష్ ట్రేడింగ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌కు రూ. 15 కోట్లు చెల్లించి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ డీల్‌పై గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఒకటి ఇరు జట్ల పరస్పర అంగీకారంతోని ఈ క్యాష్ ట్రేడింగ్ డీల్ పూర్తయిందని ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తలను ఇరు జట్లు ఖండించకపోవడంతో నిజమేననే అభిప్రాయం కలుగుతోంది.
గుజరాత్ టైటాన్స్‌ను వీడినందుకు హార్దిక్ పాండ్యాకు భారీ డబ్బుతో పాటు కొన్ని వ్యాపార ప్రకటన ఒప్పందాలను ఆఫర్‌గా ముంబై ఇండియన్స్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్‌కు కూడా రూ. 15 కోట్లతో పాటు తెర చాటు భారీ ఆఫర్ ఇచ్చిందని, పూర్తిగా ఇది వ్యాపార కోణంలో జరిగిన ఒప్పందమని ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ పాండ్యా వీడుతున్నాడనే వార్తలపై ఆకాశ్ చోప్రా తనదైన శైలిలో స్పందించాడు. 'కెప్టెన్సీ లేకుండా ముంబై ఇండియన్స్ జట్టులోకి హార్దిక్ వస్తే అంతకంటే తెలివి తక్కువ నిర్ణయం మరొకటి ఉండదు. అయితే ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ రూమర్లే. ఎవరూ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, అతను ముంబై ఇండియన్స్‌లోకి వెళ్తున్నాడనే ప్రచారం చాలా ఇబ్బందిగానే ఉంది. తొలుత అతన్ని గుజరాత్ టైటాన్స్ వదులు కోవాలి. టైటిల్ అందించిన సారథిని ఆ జట్టు వదులుకోదని నేను భావిస్తున్నా. ఒకవేళ ముంబైకి హార్దిక్ వచ్చినా.. కెప్టెన్‌గా చేస్తుందో లేదో చూడాలి.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ట్రేడింగ్ విండోతో పాటు రిలీజ్, రిటైన్ ఆటగాళ్ల జాబితాలను సమర్పించేందుకు బీసీసీఐ విధించిన గడువు ఆదివారం(నవంబర్ 26)తో ముగియనుంది. హార్దిక్ జట్టును వీడుతున్నాడనే వార్తలు నిజమో కాదో మరికొద్ది గంటల్లోనే తేలనుంది.