న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రశాంతంగా ఎలా ఉండాలో ధోనీని చూసి నేర్చుకున్నాడని తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో అతని కెప్టెన్సీ అద్భుతంగా ఉందని, చాలా ప్రశాంతంగా ఉంటూ ఆటగాళ్లకు అండగా నిలిచాడని కొనియాడాడు. హార్దిక్ పాండ్యా సూపర్ కెప్టెన్సీతోనే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరిందన్నాడు.
తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా ప్రశాంతంగా ఉంటూ ఆడంబరంగా కనిపిస్తాడని తెలిపాడు. ధోనీని చూసి ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్చుకున్నానని అతనే స్వయంగా వెల్లడించాడని ఆకాశ్ చోప్రా గుర్తు చేశాడు.

'హార్దిక్ పాండ్యా తన ప్రశాంతమైన సారథ్యంతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసంతో పాటు నమ్మకాన్ని నింపాడు. ప్రశాంతంగా ఎలా ఉండాలో ధోనీని చూసి నేర్చుకున్నానని అతనే వెల్లడించాడు. అతను ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆడంబరంగా కనిపిస్తాడు. ఈ రెండు కలిగి ఉండటం చాలా కష్టం. అయినా హార్దిక్ పాండ్యా సమతూకం పాటిస్తున్నాడు.
ధోనీ చూసినప్పడు అతను ప్రశాంతంగా ఉంటాడు. కానీ ఆడంబరాలకు పోడు. చాలా ఒదిగి ఉంటాడు. అదే కోహ్లీని చూస్తే దూకుడుగా ఉంటూ తన చర్యలతో అందర్నీ ఆకట్టుకుంటాడు. కానీ ప్రశాంతంగా ఉండడు. 'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్.. టేబుల్ టాపర్‌గా నిలిచి అందరి కన్నా ముందే ప్లే ఆఫ్స్ చేరింది. క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడినా.. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్ చేరింది. కానీ ఫైనల్లో చివరి ఓవర్‌లో తప్పిదం చేసి ఓటమిపాలైంది.
ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా 31.45 సగుటుతో 346 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక క్వాలిఫయర్-2లో 13 బంతుల్లో 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫైనల్లో 12 బంతుల్లో 21 పరుగులతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.