
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సారథిగా సౌరవ్ గంగూలీ కంటే గౌతమ్ గంభీరే ఆటగాళ్లకు ఎక్కువ భరోసా ఇచ్చాడని, కేకేఆర్‌లో ఎవరిని అడిగినా ఇదే విషయం చెబుతారని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తెలిపాడు. తాజాగా అతను కేకేఆర్ టీమ్ ప్రయాణాన్ని తన యూట్యూబ్ చానెల్లో విశ్లేషించాడు. ముఖ్యంగా సౌవర్ గంగూలీని తొలగించి గౌతమ్ గంభీర్‌ను సారథిగా నియమించడం కీలక మలుపని అభిప్రాయపడ్డాడు. గంభీర్ దూకుడు జట్టు విజయాలకు కలిసొచ్చిందన్నాడు.
ఇక కేకేఆర్ 12 ఏళ్ల ప్రయాణాన్ని మూడు విభాగాలుగా విభించిన చోప్రా.. తొలుత గంగూలీ కెప్టెన్సీ(2008-10), తర్వాత గంభీర్(2011-17), ఆపై దినేశ్ కార్తిక్ (2018 నుంచి)తరలుగా విడదీశాడు. 'కేకేఆర్ యజమాని షారుఖ్‌ఖాన్ తొలి సీజన్‌లోనే జాన్ బుచనన్, ఆండ్రూ లిపస్, ఆండ్రియన్ లీ రౌక్స్‌లతో అత్యుత్తమ సహాయక సిబ్బందిని నియమించాడు. కేకేఆర్ వరల్డ్ బెస్ట్ ఫ్రాంచైజీగా నిలపాలనుకున్నారు. కానీ ఆరంభంలో ఆశించిన ఫలితాలు దక్కలేదు. జట్టు దారుణంగా విఫలమై ఆరో స్థానంలో నిలిచింది.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.
దీంతో 2009లో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కలమ్‌కు కెప్టెన్సీ అప్పగించడం, మళ్లీ 2010లో దాదాను నియమించడం లాంటి విశేషాలను చోటుచేసుకున్నాయన్నాడు. చివరికి అప్పుడు కూడా ఆ జట్టు విఫలమవ్వడంతో షారుఖ్ కీలక నిర్ణయం తీసుకొని గంభీర్‌ను ఎంపిక చేశాడని చెప్పాడు.'గంభీర్ కెప్టెన్సీలో ఆడిన తొలి సీజన్‌లోనే కేకేఆర్ నాలుగో స్థానం నిలిచింది. తర్వాత రెండుసార్లు టైటిల్ దక్కించుకుంది. దాదా కన్నా ఢిల్లీ క్రికెటరే ఆ జట్టు ఆటగాళ్లకు భరోసా ఇచ్చాడు. ఈ విషయాన్ని గంభీర్ సారథ్యంలో ఆడిన ఏ ఆటగాడిని అడిగినా చెబుతారు.'అని ఈ మాజీ క్రికెటర్ స్పష్టం చేశాడు.
అలాగే గంభీర్ విజయవంతం కావడానికి మరో కారణం కూడా ఉందని, అదే అతడి దూకుడుతనంమని తెలిపాడు. గౌతీ చెప్పిన మాట, చేసే పనిని ఆటగాళ్లు కూడా కచ్చితంగా పాటించాలని చెప్పేవాడన్నాడు . అలా అతడు ముందుండి జట్టును నడిపించాడని చోప్రా గుర్తు చేసుకున్నాడు. దినేశ్ కార్తీక్ సారథ్యంలో కూడా కేకేఆర్ ఫర్వాలేదనిపించిందని, 2018లో మూడో స్థానంలో నిలిచిన ఆ జట్టు.. 2019లో ఐదో స్థానానికి పరిమితమైందన్నాడు. ఇక ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్ జట్టుపై కేకేఆర్ రికార్డు మరి చెత్తగా ఉందన్నాడు.