న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో సెంచరీల మోత మోగిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఒక్కడే అడ్డుకోగలడని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మరికాసేపట్లో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్లో గుజరాత్, చెన్నై జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
చెన్నై జట్టుకు ఇది పదో ఐపీఎల్ ఫైనల్‌కాగా.. గుజరాత్ టీమ్‌కు వరుసగా రెండో ఫైనల్. గతేడాది ఇదే మైదానం వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన గుజరాత్ టైటాన్స్ అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా అదే ఆటతీరుతో ఫైనల్ చేరిన ఆ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

శుభ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈసీజన్‌లో ఇప్పటికే 16 మ్యాచ్‌లు ఆడిన శుభమన్ గిల్ 156.43 స్ట్రైక్‌రేట్‌తో 851 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్లో శుభమన్ గిల్ మరో 123 పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు.
ఐపీఎల్ 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ 16 మ్యాచ్‌ల్లో 973 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఓ సీజన్‌లో బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ముంబై ఇండియన్స్‌తో గత శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఫైనల్లో కూడా ఈ తరహా ఇన్నింగ్స్ ఆడితే కోహ్లీ రికార్డు బద్దలు కానుంది.
అయితే ఫైనల్లో శుభ్‌మన్ గిల్‌ను ఔసే సత్తా దీపక్ చాహర్ ఒక్కడికే ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 'శుభ్‌మన్ గిల్ చాలా భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒకవేళ కోహ్లీ రికార్డ్‌ను అతను బ్రేక్ చేయాలంటే మరోసారి సెంచరీ మార్క్‌ను అందుకోవాల్సి ఉంటుంది. చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనే మూడు సెంచరీలు బాదిన శుభ్‌మన్ గిల్‌కు ఇదేమంత కష్టం కాదు.
కానీ.. అతనికి చెన్నై బౌలర్ దీపక్ చాహర్‌తో ప్రమాదం పొంచి ఉంది. కొత్త బంతితో అతన్ని ఎదుర్కోవడం గిల్‌కు పెద్ద ఛాలెంజ్. ఒకవేళ దీపక్ చాహర్‌ను గిల్ ఎదుర్కోగలిగితే.. ఆ రికార్డ్ సాధ్యమే'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.