టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025నే చివరి ఐసీసీ టోర్నీ అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆకాశ్ చోప్రా ఈ విషయాన్ని తెలియజేశాడు. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి తెరలేవనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం భారత జట్టు శనివారమే దుబాయ్ బయల్దేరింది.
దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తోంది. చివరిసారిగా ఇంగ్లండ్ వేదికగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగ్గా పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్‌ను ఓడించి మరి పాకిస్థాన్ టైటిల్ అందుకుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మాత్రమే తాజా టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయంతో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.

అయితే ఈ నలుగురిలో ముగ్గురి ఆటగాళ్లకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ అవుతుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. 'మీ అంచనా 100 శాతం నిజం. కోహ్లీ, రోహిత్, జడేజాకు ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి ఐసీసీ టోర్నీ కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించలేదు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఇప్పటికే ఈ ముగ్గురు ఆటగాళ్లు టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత 2027లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. అందుకు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి అప్పటి వరకు జట్టులో భారీ మార్పులు రావచ్చు. ఈ క్రమంలోనే కోహ్లీ, రోహిత్, జడేజాలకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ కానుంది. ఈ ముగ్గురి లోటు లేకుండా టీమిండియా ఆడినప్పుడే ఇది సాధ్యమవుతుంది.'అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.