టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ ఆరంభంలో చాలా సిగ్గుపడేవాడని మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇండియా-ఏకు ఆడే రోజుల్లో తామిద్దరం నెల రోజుల పాటు ఒకే రూమ్‌లో ఉన్నామని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో నాన్‌వెజ్ తినడానికి కూడా ధోనీ సిగ్గుపడేవాడని, తాను ఏది తింటే అదే తిన్నాడని గుర్తు చేసుకున్నాడు.
వెజిటేరియన్ అయిన తన కోసం ధోనీ నెల రోజుల పాటు నాన్ వెజ్ తినలేదని చెప్పుకొచ్చాడు. 'శాకాహారినైన నా కోసం ధోనీ నెల రోజుల పాటు మాంసాహారం తినలేదు. ధోనీ మొబైల్ తరుచూ రింగ్ అయ్యేది. కానీ అతను మాత్రం సమాధానం ఇచ్చేవాడు కాదు. ఎప్పుడు పడుకుంటావ్? అని నేను ధోనీని అడిగినప్పుడు.. నీకు ఎప్పుడు లైట్స్ ఆఫ్ చేయాలంటే అప్పుడే ఆఫ్ చేయండని బదులిచ్చాడు.

అతను నాన్ వెజిటేరియన్ అయితే నేను వెజిటేరియన్. రూమ్‌మేట్స్‌గా మా ఇద్దరి భాగస్వామ్యం సరికాదు. నేను ఏం తింటావని అడిగితే.. మీరు ఏది తింటే అదే తింటానని చెప్పేవాడు. రూమ్ సర్వీస్ కోసం కూడా ఎప్పుడూ కాల్ చేయలేదు. అతను చాలా సిగ్గుపడేవాడు. నా కోసం అతను ఒక నెల రోజుల పాటు శాకాహారమే తిన్నాడు.'అని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
భారత్ తరఫున 10 టెస్ట్‌లు మాత్రమే ఆడిన ఆకాశ్ చోప్రా.. 2003లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో ఓపెనింగ్ చేసాడు. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతని కెరీర్ 10 టెస్ట్‌లకే ముగిసింది. 2004 అక్టోబర్‌లో ఆకాశ్ చోప్రా చివరి టెస్ట్ ఆడాడు.
మరోవైపు ధోనీ 2004 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైనా.. తర్వాతి సిరీస్‌ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి అంచెలంచెలుగా ఎదిగాడు. కెప్టెన్‌గా భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు. భారత్ తరఫున 90 టెస్ట్‌లు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడిన ధోనీ.. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు.
2007 నుంచి 2016 వరకు భారత జట్టు కెప్టెన్‌గా కొనసాగాడు. 2018లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో చివరిసారిగా సారథ్యం వహించాడు. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.