ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియాకు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక సలహా ఇచ్చాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను మిడిలార్డర్‌లో కాకుండా టాప్-3లో ఆడించాలని సూచించాడు. ఆసియాకప్ 2025కు ఎంపికైన భారత జట్టులో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కింది. కానీ శుభ్‌మన్ గిల్ రీఎంట్రీతో అతను ఓపెనర్‌గా ఆడే అవకాశాలు లేవు. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో ఓపెనింగ్ చేసిన సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మూడు శతకాలు సాధించాడు.
అయినా సంజూను ఓపెనర్‌గా కొనసాగించడం కష్టమని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హింట్ ఇచ్చాడు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ గైర్హజరీతోనే సంజూ ఓపెనర్‌గా అవకాశాలు అందుకున్నాడని స్పష్టం చేశాడు. దాంతో సంజూకు తుది జట్టులో చోటు కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చిన జితేష్ శర్మ.. లోయరార్డర్ స్పెషలిస్ట్ బ్యాటర్. లోయరార్డర్‌లో సంజూ కంటే మెరుగైన ప్రదర్శన చేయగలడు. దాంతోనే సంజూ బెంచ్‌కే పరిమితమవుతాడని అంతా అనుకున్నారు. కానీ కేరళ క్రికెట్‌లో లీగ్ సంజూ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దాంతో అతన్ని మిడిలార్డర్‌లో ఆడించవచ్చనే అభిప్రాయం కలుగుతోంది.

ఈ క్రమంలోనే సంజూను టాప్-3లో ఆడించాలని ఆకాశ్ చోప్రా తెలిపాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన చోప్రా.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'సంజూ శాంసన్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం లేదు. ఇప్పటికే అభిషేక్ శర్మ ఓపెనర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. మరోవైపు శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇచ్చాడు. దాంతో సంజూకు ఓపెనర్‌గా అవకాశం దక్కడం కష్టంగా మారింది. కానీ గత 12 మ్యాచ్‌ల్లో సంజూ ఓపెనర్‌గా 3 సెంచరీలు చేశాడు. కాబట్టి అతనికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి.
ఓపెనర్‌గా అవకాశం లేకపోతే నంబర్ 3లో ఆడించాలి. టాప్-3 పొజిషన్‌లో సంజూ 140 స్ట్రైక్‌రేట్‌తో 6000 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా మిడిలార్డర్‌లో ఆడిస్తే జట్టుకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే నాలుగు నుంచి ఏడు స్థానాల్లో సంజూ రికార్డ్స్ మెరుగ్గా లేవు. మిడిలార్డర్‌లో 98 మ్యాచ్‌లు ఆడిన సంజూ 20 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 126 మాత్రమే. కాబట్టి సంజూ శాంసన్‌ను టాప్-3లో ఆడించాలి.
కేఎల్ రాహుల్‌కు టీ20ల్లో మరో అవకాశం ఇవ్వాలి. అతను మూడు ఫార్మాట్లు ఆడగల ఆటగాడు. రాహుల్ టాప్-3 బ్యాటింగ్ గణంకాలు మెరుగ్గా ఉన్నాడు. 137 స్ట్రైక్ రేట్, 43 సగటుతో పరుగులు చేశాడు. అయితే ఈ తరం టీ20 క్రికెట్‌కు తగ్గట్లు అతని స్ట్రైక్‌రేట్ మెరుగవ్వాలి. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ నా అభిప్రాయం ప్రకారం 42 సగటు మెరుగైందే. మిడిలార్డర్, లోయరార్డర్‌లో రాహుల్‌కు మెరుగైన రికార్డ్ ఉంది. 40 సగటు, 133 స్ట్రైక్‌రేట్‌తో రాణించాడు.'అని ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.