ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 250 పరుగులు చేసినా విజయం సాధిస్తుందనే నమ్మకం లేదని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ బలంగా ఉన్నా.. బౌలింగ్ బలహీనంగా ఉందని తెలిపాడు. బ్యాటర్లు 250 పరుగులు చేస్తే బౌలర్లు కూడా 250 పరుగులు సమర్పించుకుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 సీజన్ కోసం తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. గతేడాది కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే తమ హోమ్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు.
మోకాలి గాయంతో బాధపడుతున్న అతను సెకండాఫ్ లీగ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్‌ను తాత్కలిక సారథిగా ఎంపిక చేశారు. శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ, ఆస్ట్రేలియా పేస్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోనున్నారు. దాంతో సన్‌రైజర్స్ బౌలింగ్ బలహీనంగా మారింది.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'కమిన్స్, మలింగ లేకపోవడంతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపిస్తోంది. కచ్చితంగా సన్‌రైజర్స్‌కు బౌలింగ్‌లో సవాళ్లు ఎదురవుతాయి.

బ్రైడన్ కార్స్ ఉన్నప్పటికీ భారత పిచ్‌లపై అతనికి అంతగా అనుభవం లేదు. కేవలం భారత బౌలర్లతో జట్టు నడిపించడం చాలా కష్టం. అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మాలే, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్, హర్ష్ దూబే వంటి యువ బౌలర్లు ఉన్నారు.
హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్‌కు మాత్రమే అనుభవం ఉంది. ఈ బలహీనమైన బౌలింగ్ లైనప్‌తో సన్‌రైజర్స్ ఎలా మేనేజ్ చేస్తోందో అర్థం కావడం లేదు. ఒకవేళ బ్యాటర్లు 250 పరుగులు చేసినా.. బౌలర్లు ఆ లక్ష్యాన్ని కాపాడలేరు.'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.