ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యుడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. యువ సారథి శుభ్‌మన్ గిల్‌ను ఇప్పుడే నిందించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌కు అడిగిందల్లా బీసీసీఐ, సెలెక్టర్లు ఇచ్చారని, కానీ ఫలితాలు మాత్రం సానుకూలంగా లేవని చెప్పాడు. గంభీర్ పనితీరును ప్రశ్నించాల్సిందేనన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ విజయం సాధించకపోతే.. గంభీర్‌పై మరిన్ని విమర్శలు వస్తాయని తెలిపాడు.
గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ గెలిచిన భారత్.. ఆ తర్వాత జరిగిన రెండు సిరీస్‌ల్లో ఘోర ఓటమిని చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 3-1తో కోల్పోయింది. ఈ ఓటములతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయింది. ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించింది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌లు గంభీర్ సూచనలతోనే రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మెరుగైన విజయాలు సాధించినా.. టెస్ట్‌ల్లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతుంది. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. గంభీర్ పనితీరును ప్రశ్నించాడు.
'బాగా ఆడితే మెచ్చుకోవడం.. విఫలమైతే విమర్శలు గుప్పించడం భారత క్రికెట్ సూత్రం. అయితే ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ఓటమికి నేను శుభ్‌మన్ గిల్‌ను నిందించలేను. ఎందుకంటే అతను ఇప్పుడే కెప్టెన్ అయ్యాడు. అతనికి కొంత సమయం ఇవ్వాలి. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాత్రం చాలా ఒత్తిడి ఉంది. అది రోజు రోజుకు పెరుగుతోంది. కోచ్‌గా అతని పర్యవేక్షణలోని టీమిండియా టెస్ట్ క్రికెట్, రెడ్ బాల్ ఫార్మాట్ ప్రదర్శనను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. కోచ్‌గా గంభీర్‌కు టెస్ట్‌ల్లో ఆశించిన ఫలితాలు దక్కలేదు. బంగ్లాదేశ్‌పై రెండు టెస్ట్‌లు, ఆస్ట్రేలియా ఒకటి మాత్రమే గెలిచాడు. న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో మూడు, ఇంగ్లండ్‌తో ఒక మ్యాచ్ ఓడిపోయాడు. వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు.
వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం కోచ్‌గా గంభీర్ ప్రదర్శన మెరుగ్గా ఉంది. జట్టు కూడా బాగా ఆడుతోంది. కానీ టెస్ట్ క్రికెట్‌లో మత్రం సానుకూల ఫలితాలు రావడం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ విషయంలోనూ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సిరీస్ గెలవకపోతే.. గంభీర్ పని తీరుపై విమర్శలు వస్తాయి. ఈ సిరీస్‌ను భారత్ గెలవాలని నేను కోరుకుంటున్నా. అయితే గంభీర్ కోరిన ప్రతీది సెలెక్టర్లు, బీసీసీఐ చేసింది. ఎలాంటి ఆటగాళ్లు కావాలంటే అలాంటి ప్లేయర్లను సెలెక్టర్లు ఇచ్చారు. కాబట్టి గంభీర్ విజయాలు అందించాల్సి ఉంది. ఈ విషయంలో ఎలాంటి సాకులకు ఆస్కారం లేదు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.