
న్యూఢిల్లీ: క్రికెట్‌లో నెపోటిజమ్ లేదని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. బంధుప్రీతే ఉంటే టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ తనయులు భారత జట్టులోకి వచ్చి మంచి స్థానంలో ఉండేవారన్నాడు. టాలెంట్ లేకుండా క్రికెట్‌లో రాణించడం కష్టమని చెప్పుకొచ్చాడు. కిందిస్థాయి క్రికెట్‌లో సాధ్యమైనా.. పైస్థాయిలో కుదరదన్నాడు.
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో 'నెపోటిజమ్' తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే బంధుప్రీతి అనేది క్రికెట్‌లో కూడా ఉందని కొంతమంది అభిమానులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన సొంత యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మాజీ ఓపెనర్ స్పందించాడు.
'క్రికెట్‌లో నెపోటిజమ్ అనేదే లేదు. విశాల దృక్పథంతో చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది. బంధుప్రీతే ఉంటే సునీల్ గవాస్కర్ కుమారుడు రోహన్ గవాస్కర్ భారత్ తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడేవాడు. కానీ అలా జరగలేదు. బెంగాల్ తరఫున అద్బుతంగా రాణించడంతోనే అతను భారత్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడగలిగాడు. అంతేందుకు రోహన్ ముంబై జట్టు తరఫున రంజీట్రోఫీ కూడా ఆడలేకపోయాడు. గావస్కర్ ఇంటిపేరున్నా అతనికి అవకాశం దక్కలేదు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పరిస్థితి కూడా ఇదే. అతనికి కూడా భారత జట్టులో అవకాశం దక్కలేదు. చివరకు భారత అండర్-19 టీమ్ జట్టులో కూడా పనికిమాలిన ఎంపికలు ఉండవు.'అని ఆకాష్ చోప్రా స్పష్టం చేశాడు.
ఇక రోహన్ గవాస్కర్ భారత్ తరఫున 11 వన్డేలు ఆడి 151 పరుగులు మాత్రమే చేశాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో బెంగాల్ తరఫున రాణించడంతోనే అతనికి ఈ అవకాశం దక్కింది. ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ, టీ20 క్రికెట్‌లో కలిపి.. ఈ లెఫ్టాండర్ 10,208 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2018లో భారత అండర్-19 జట్టుకు ఎంపికైన అర్జున్ టెండూల్కర్.. ఈ ఏడాది సౌతాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ కూడా ఆడలేకపోయాడు. గతేడాది ముంబై టీ20 లీగ్‌లో ఆడినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.