ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశించింది. అంతేకాకుండా అదే రోజు (అక్టోబర్ 31(గురువారం)) సాయంత్రం 5 గంటల నుంచి ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమాలు రిటెన్షన్ జాబితాలను అధికారికంగా వెల్లడించనున్నాయి.
మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలనే నిబంధన పెట్టింది. ఈ ఆరుగురి ఆటగాళ్లను నేరుగా లేదా వేలంలో ఆర్‌టీఎమ్ కార్డ్‌తో తిరిగి కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది.

రిషభ్ పంత్ గుడ్‌బై..
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ గుడ్‌బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. పలు ఫ్రాంచైజీలు అతన్ని సంప్రదించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్‌కు పంత్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన వివాదాల నేపథ్యంలోనే పంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే రిషభ్ పంత్.. వేలంలోకి వస్తే ఎవరైనా కోనుగోలు చేస్తారా? ఎంత ధర పలుకుతాను? అంటూ ట్వీట్ చేశాడు. అప్పట్లో ఈ ట్వీట్‌ను అంతా జోక్‌గా తీసుకున్నారు. తాగిన మైకంలో ట్వీట్ చేశాడని కామెంట్ చేశారు. కానీ ఢిల్లీని వదిలేయాలనే భావించే పంత్ ఈ ట్వీట్ చేసినట్లు తాజాగా అర్థమైంది.
రూ. 30 కోట్లు పక్కా..
రిషభ్ పంత్ మెగా వేలంలో వస్తే రూ.30 కోట్లు పలుకుతాడని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. 'రిషభ్ పంత్ మెగావేలంలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన రిషభ్ పంత్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతాయి. టీ20ల్లో పంత్ గణంకాలు బాగా లేవని, ఐపీఎల్‌లో ఒక్క సీజన్‌లో మాత్రమే రాణించాడని. ఎక్కువ రన్స్ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. కానీ పంత్ వేలంలోకి వస్తే భారీ ధర పలుకుతాడని రాతపూర్వకంగా హామీ ఇవ్వగలను.
ఆర్‌సీబీకి ఒక వికెట్ కీపర్, బ్యాటర్‌తో పాటు కెప్టెన్ కూడా కావాలి. పంజాబ్, కేకేఆర్, సీఎస్‌కే జట్లకు రిషభ్ పంత్ అవసరం ఉంది. ఇషాన్ కిషన్‌ను రిటైన్ చేసుకోకపోతే ముంబై ఇండియన్స్ కూడా పంత్ కోసం రేసులోకి వస్తోంది. లక్నో నికోలస్ పూరన్‌ను రిటైన్ చేసుకున్నా పంత్‌పై ఆసక్తి చూపుతోంది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో పాటు అన్ని జట్లు పంత్ కోసం పోటీపడుతాయి. కాబట్టి అతను భారీ ధర పలుకుతాడు. పంత్ రూ. 25-30 కోట్లు దక్కించుకుంటాడు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.