పాపం విహారీ.. బ్యాటింగ్ బలహీనంగా ఉంటే.. ఎక్స్‌ట్రా బౌలర్ ఎందుకో: ఆకాశ్ చోప్రా

న్యూఢిల్లీ: ఫస్ట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్ రెండో టెస్ట్‌కు సమాయత్తం అవుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ, స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయంతో జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఫస్ట్ టెస్ట్‌లో విఫలమైన ఓపెనర్ పృథ్వీషా, వృద్దిమాన్ సాహా, హనుమ విహారీపై వేటు పడనుండగా.. శుభ్‌మన్‌గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, నవ్‌దీప్ సైని లేదా మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి రానున్నారు. అయితే జట్టులో మార్పులపై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా తాజాగా ఫేస్‌బుక్ వేదికగా స్పందించాడు.

బ్యాటింగ్ వైఫల్యం..
బ్యాటింగ్ బలహీనతతో సతమతమవుతున్న టీమిండియా.. దాన్ని అధిగమించకుండా మరో బౌలర్ ఎంచుకోవడం వెనుకు ఉన్న వ్యూహం ఏంటని ప్రశ్నించాడు. ఫస్ట్ టెస్ట్ ఓటమికి బలహీనమైన బ్యాటింగే కారణమని, అలాగే ఆసీస్ బ్యాటింగ్ కూడా ఒకరిద్దరిపైనే ఆధారపడి ఉందన్నాడు.‘బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిడియా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగనుందని రవీంద్ర జడేజా తుది జట్టులోకి రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా ఈ వ్యూహం ఏంటో నాకు అర్థం కావడం లేదు. భారత జట్టు అసలు సమస్య బ్యాటింగ్. కానీ బౌలింగ్ కాదు. బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమిపాలయ్యాం.

విహారీ చేసిన తప్పేంటి..?
బౌలర్లు అద్భుతంగా రాణించారు. నలుగురు బౌలర్లతో కూడా రాణించవచ్చు. మహ్మద్ షమీ లేని లోటు పూడ్చలేనిదేనని అంగీకరిస్తాను. కానీ ఆసీస్ బ్యాటింగ్ కూడా బలహీనంగానే ఉంది. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌పైనే ఆధారపడి ఉంది. అలాంటప్పుడు ఆరుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌తో కొనసాగించాలి. హనుమ విహారీని ఖచ్చితంగా ఆడించాలి. కానీ జడేజా కోసం అతన్ని తప్పిస్తారని తెలుస్తోంది. అసలు విహారి చేసిన తప్పేంటో ఎవరికీ తెలియదు. గత కొంతకాలంగా అతను నిలకడగా రాణిస్తున్నాడు. వార్మప్ గేమ్‌లో సెంచరీ చేశాడు. ఫామ్ కూడా అంత చెత్తగా ఏం లేదు.

సాహాకు ఏం చెబుతారు..?
పృథ్వీకి బదులు శుభ్‌మన్ లేదా రాహుల్ ఓపెనింగ్ చేస్తారని, మూడో టెస్టులో మళ్లీ రోహిత్ అందుబాటులోకి వస్తే ఎవరో ఒకరు తప్పుకోవాల్సిందేనని చోప్రా సందేహం వెలిబుచ్చాడు. ఇక నాలుగో స్థానంలో రహానె బ్యాటింగ్ చేస్తుండగా, ఐదులో మళ్లీ రిషభ్‌పంత్ ఉంటాడని, తర్వాత రవీంద్ర జడేజా ఆడతాడని చెప్పాడు. ఈ క్రమంలోనే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ హానుమ విహారి, వృద్ధిమాన్ సాహా చోటు కోల్పోతారన్నాడు. ఇక కోహ్లీ లేనందును బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత బలం చేకూరేందుకు సాహాకు బదులు పంత్‌ను తీసుకొస్తారని తెలిపాడు. ఈ నేపథ్యంలో యువ బ్యాట్స్‌మన్‌ను తీసుకుంటే సాహాకు ఏం చెప్పి తొలగిస్తారని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications