ఐపీఎల్ 2026 సీజన్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, కోడలు సానియా ఛందోక్ సందడి చేస్తున్నారు. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు మద్దతుగా ఈ ఇద్దరూ మ్యాచ్‌లకు హాజరవుతున్నారు. తుది జట్టులో అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం లేకపోయినా.. వాటర్ బాటిల్స్ మోస్తూ కనిపించినా.. ఈ వదిన-మరదళ్లు మాత్రం లక్నో జట్టుకు మద్దతుగా ప్రతీ మ్యాచ్‌కు హాజరవుతున్నారు.
సోమవారం ముంబై ఇండియన్స్‌తో వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కూడా ఈ వదిన-మరదళ్లు సందడి చేశారు. అర్జున్ సతీమణి సానియా చందోక్ లక్నో జెర్సీతో తన మద్దతును బాహటంగానే తెలియజేస్తున్నా.. సారా టెండూల్కర్ మాత్రం న్యూట్రల్‌గా ఉంటూ తన మరదల్ సానియా చందోక్‌కు సపోర్ట్‌గా నిలుస్తోంది. అయితే నిన్నటి మ్యాచ్‌లో ఈ వదిన-మరదళ్లకు వింత అనుభవం ఎదురైంది.

అర్జున్ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోగా.. సచిన్ టెండూల్కర్ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ గెలిచింది. దాంతో ఈ ఇద్దరూ ఒకింత బాధ, కొంచెం ఆనందంతో స్టేడియం వీడారు. ఈ ఇద్దరూ మైదానం నుంచి మిక్స్‌డ్ అనుభూతితో బయటకు వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. 'లక్నో ఓడినా.. ఈ వదిన-మరదళ్లకు అనందమే.. ఎందుకంటే సచిన్ గెలిచాడు.'అని ఒకరంటే.. తదుపరి మ్యాచ్‌ల్లోనైనా ఈ వదిన-మరదళ్ల కోసం అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం ఇవ్వాలని లక్నోను మరో అభిమాని రిక్వెస్ట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసినా విజయం సాధించలేకపోయింది. ఈ భారీ లక్ష్యాన్ని ముంబై 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది.

నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 8 సిక్స్‌లతో 63) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. మిచెల్ మార్ష్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), ఎయిడెన్ మార్క్‌రమ్(25 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 31 నాటౌట్), హిమ్మత్ సింగ్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కార్బిన్ బోష్(2/20) రెండు వికెట్లు తీయగా.. అల్లా ఘజన్‌ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 83), రోహిత్ శర్మ(44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. నమన్ ధీర్(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్2తో 23 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. లక్నో బౌలర్లలో మణిమరన్ సిద్దార్థ్(2/47) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మోహ్‌సిన్ నఖ్వీ చెరో వికెట్ పడగొట్టారు.
