టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. పెద్ద మ్యాచ్‌లు ఎలా గెలవాలో టీమిండియాకు రోహిత్ శర్మ నేర్పించాడని కొనియాడాడు. వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన నేపథ్యంలో తన ఫేస్‌బుక్ వేదికగా మాట్లాడిన దినేశ్ కార్తీక్.. రోహిత్ సేవలను కొనియాడాడు. రోహిత్ శర్మ గొప్ప సారథి అని చెప్పుకొచ్చాడు.
'రోహిత్ శర్మకు థ్యాంక్స్. మీరు వ్యూహాత్మకంగా చతురత కలిగిన అద్భుతమైన కెప్టెన్. ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారు. అందరిని కలుపుకుపోయారు. ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా సౌకర్యంగా ఉండేలా చేశారు. పెద్ద టోర్నీల్లో అతి ముఖ్యమైన మ్యాచ్‌ల్లో గెలవడానికి ఏమి అవసరమో ప్రస్తుత జట్టుకు నేర్పించావు. కొన్నిసార్లు మేము వెనక్కి తగ్గేవాళ్లం. కానీ నువ్వు మాత్రం మమ్మల్ని ప్రోత్సహించేవాడివి. మరింత ముందుకు సాగి, ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాలని, టైటిల్ వదిలేయకూడదని చెప్పేవాడివి.

పెద్ద మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా మరింత బాధ్యత తీసుకొని బ్యాటింగ్ చేశావు. మనం ఆడిన చివరి 3 పెద్ద టోర్నీల్లో భారత ఒక మ్యాచ్ మాత్రమే ఓడింది. 2024 టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా ముందుకు సాగాం. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మాత్రమే ఓడాం. అదే జోరు ఇప్పుడూ కూడా చూస్తున్నాం. ఇటీవల యువ జట్టు ఆసియా కప్ గెలిచింది. ఆ స్ఫూర్తి మీరు అందించినదే. కెప్టెన్‌గా మీరు బాధ్యతలు చేపట్టినప్పటి కంటే జట్టును మెరుగైన స్థానంలో ఉంచారు. అది గొప్ప నాయకుడి లక్షణం.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
అక్టోబర్ 19 నుంచి టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం భారత్ అక్కడికి వెళ్లనుంది. నవంబర్ 8 వరకు కొనసాగే ఈ పర్యటనలో ముందుగా వన్డేలు.. ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనుంది. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన జట్లను భారత సెలెక్టర్లు ప్రకటించారు.
టీమిండియా వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా, శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కెప్టెన్సీ కోల్పోయినా ఆటగాడిగా రోహిత్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. రవీంద్ర జడేజాపై వేటు వేసిన సెలెక్టర్లు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు. సిరాజ్ వన్డే టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వగా.. బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. ఆసియా కప్ 2025లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన తిలక్ వర్మ.. టీ20లకే పరిమితమయ్యాడు.