
లండన్: లార్ట్స్ టెస్ట్ విజయానందంలో ఉన్న యావత్ భారతం.. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మైమరిపించే ఫీల్డింగ్‌ను గుర్తించలేకపోయింది. స్లిప్‌లో ఒంటిచేత్తో అతను పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ను కనిపెట్టలేకపోయింది. అవును.. ఇప్పుడు గనుక మీరు ఆ వీడియోను చూస్తే వావ్ అంటూ నోరెళ్ల బెడతారు. అయితే రోహిత్ శర్మ అందుకున్న క్యాచ్ భారత విన్నింగ్ మూమెంట్ కావడంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు. భారత్ సాధించిన చారిత్రాత్మక విజయం ముందు రోహిత్ ఫీల్డింగ్ ఎఫర్ట్ చిన్నబోయింది.
అసలేం జరిగిందంటే.. మహమ్మద్ సిరాజ్ వేసిన 52 ఓవర్‌లో రెండో బంతికి బట్లర్ ఔటవ్వగా.. ఐదో బంతికి జేమ్స్ అండర్సన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో వేసిన ఆ బంతిని అండర్సన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్‌ను ముద్దాడుతూ వికెట్ స్టంప్స్‌ను లేపేసింది. అయితే స్టంప్స్ తాకిన బంతి నేరుగా స్లిప్‌లో ఉన్న రోహిత్ వైపు దూసుకెళ్లింది. దాంతో ఆ బంతిని రోహిత్ ఒంటి చేత్తో అద్భుతంగా అందుకున్నాడు. ఈ వికెట్‌తో భారత విజయం లాంఛనమవడంతో ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగి తేలారు.
ఈ క్రమంలోనే రోహిత్ క్యాచ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. టీవీ రీప్లేలో కూడా రోహిత్ క్యాచ్ పట్టిన విషయం కనబడలేదు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఓ అభిమాని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఎవరూ గుర్తించని రోహిత్ శర్మ సూపర్ క్యాచ్ అంటూ క్యాప్షన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నిజంగా అద్భుతమైన క్యాచని, విజయానందరంలో గుర్తించలేకపోయామని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
181/6 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించారు. దాంతో భారత్‌కు 271 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్(96 బంతుల్లో 25), జోరూట్(60 బంతుల్లో 33) పోరాడినా ఫలితం లేకపోయింది.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/32) నాలుగు వికెట్లతో చెలరేగగా.. జస్‌ప్రీత్ బుమ్రా(3/33) మూడు, ఇషాంత్ శర్మ(2/13) రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ(1/13)కి ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0తో బోణీ కొట్టింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఆగస్టు 25న(బుధవారం) లీడ్స్ వేదికగా జరగనుంది.