ఇంగ్లండ్ గడ్డపై భారత అండర్ 19 జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భారత కుర్రాళ్ల టీమ్ మరో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ(31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 86) విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎదుర్కొన్న 31 బంతుల్లో 15 బంతులను బౌండరీకి తరలించాడు.
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ అండర్ 19 టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 268 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ థామస్ రే(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76 నాటౌట్), బీజే డాకిన్స్(61 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత అండర్ 19 బౌలర్లలో కనిష్క్ చౌహన్(3/30) మూడు వికెట్లు తీయగా.. దీపేష్ దేవండ్రన్, విహాన్ మల్హోత్ర, నమన్ పుష్పక్ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత అండర్ 19 జట్టు 34.3 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి తోడు విహాన్ మల్హోత్ర(46), కనిష్క్ చౌహన్(43 నాటౌట్), అంబ్రీష్(31 నాటౌట్) రాణించారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 277.41 స్ట్రైక్‌రేట్ బ్యాటింగ్ చేయడం గమనార్హం. ఐపీఎల్ ఫామ్‌ను ఈ 14 ఏళ్ల బిహార్ కుర్రాడు..యూత్ వన్డే సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ అండర్ 19 జట్టు 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే శనివారం జరగనుంది.
ఈ మ్యాచ్‌లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డ్ సాధించాడు. అండర్ 19 వన్డేలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. వైభశ్ సూర్యవంశీ కంటే ముందు రిషభ్ పంత్.. అండర్ 19 వన్డేల్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ.. సురేశ్ రైనా పేరిట ఉన్న అండర్ 19 రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. యూత్ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 80 ప్లస్ రన్స్ చేసిన బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. 277.41 స్ట్రైక్‌రేట్ వైభవ్ 86 పరుగులు చేయగా.. సురేశ్ రైనా 2004లొ 236.84 స్ట్రైక్‌రేట్‌తో స్కాట్లాండ్‌పై 90 పరుగులు చేశాడు.