న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న ఏకైక క్రికెటర్. ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులున్నారు. శతృదేశం పాకిస్థాన్‌లోనూ కోహ్లీ ఆట అంటే పడిచచ్చేవారున్నారు. మైదానంలో తన ఆటతో పాటు ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా కోహ్లీ తీవ్ర ప్రభావం చూపుతున్నాడు.
ఇండియన్ క్యాష్ రిచ్ లీగ్(ఐపీఎల్)లోనూ విరాట్ కోహ్లీకి తిరుగులేదు. టైటిల్ విషయం మినహా అరుదైన ఘనతలన్నీ అతనిపైనే ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్ సంపాదనలో మాత్రం కోహ్లీ వెనుకబడ్డాడు. ఐపీఎల్ 2022 సీజన్ వరకు రూ.17 కోట్ల వార్షిక వేతనంతో హయ్యెస్ట్ సాలరీతీసుకున్న ప్లేయర్‌గా కొనసాగిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు ఏకంగా 10వ స్థానానికి పడిపోయాడు.

ఐపీఎల్ 2022 మెగా వేలం ముంగిట రిటెన్షన్ పాలసీలో భాగంగా జట్టు కోసం రూ.2 కోట్లు తగ్గించుకున్న కోహ్లీ.. రూ.15 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు. దాంతో హయ్యెస్ట్ సాలరీ తీసుకుంటున్న ఐపీఎల్ ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 9వ స్థానానికి పడిపోయాడు. ఇషాన్ కిషన్ కూడా విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ జీతం తీసుకోవడం విశేషం.
ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో ఆడుతున్నాడు. ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన సామ్ కరణ్.. అత్యధిక వేతం అందుకుంటున్న ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఐపీఎల్ 2023 సీజన్ మినీవేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని రూ.18.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
అయితే ఆ అంచనాలను సామ్ కరణ్ నిలబెట్టుకోలేకపోయాడు. దాంతో అతను మళ్లీ వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ రూ.17.5 కోట్లతో అత్యధిక ఐపీఎల్ వేతనం అందుకుంటున్న రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో కామెరూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఈ వేలానికి ముందు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో గ్రీన్ అదరగొట్టాడు. అది అతనికి బాగా కలిసొచ్చింది. తన ప్రైజ్‌ట్యాగ్ తగ్గట్లు రాణించిన కామెరూన్ గ్రీన్‌ను ముంబై ఈసారి కూడా అంటిపెట్టుకోనుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రూ.17 కోట్ల ఐపీఎల్ వేతనంతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు ముందు లక్నో రాహుల్‌ను పికప్ ఆప్షన్ కింద ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా కొనసాగుతున్న అతను.. ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమయ్యాడు.
రూ.16.25 కోట్లతో బెన్ స్టోక్స్ నాలుగో స్థానంలో ఉండగా.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. కానీ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు.
రూ.16 కోట్ల వేతనంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, లక్నో సూపర్ జెయింట్స్ హిట్టర్ నికోలస్ పూరన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, రూ.15.25 కోట్లతో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ విరాట్ కోహ్లీ కన్నా ముందంజలో ఉన్నారు.