టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని చెత్త రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది. సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు కుప్పకూలింది.
ఓ దశలో 153/4 స్కోర్‌తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది. చివరి ఆరుగురు బ్యాటర్లలో ఐదుగురు కనీసం ఖాతా తెరవలేకపోయారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇలా ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.

ఈ చెత్త ఫీట్ సాధించిన జట్టుగా టీమిండియా అప్రతిష్టను మూటగట్టుకుంది. భారత జట్టులో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా... జస్‌ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో రాణించారు.
సఫారీ బ్యాటర్లలో డేవిడ్ బెడింగ్‌హమ్(12), కైల్ వెర్రెయన్(15) మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. ఫస్ట్ సెషన్‌లోనే సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్(0) వికెట్ కోల్పోయినా.. శుభ్‌మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39) నిలకడగా బ్యాటింగ్ చేశారు. రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ శర్మ వెనుదిరగ్గా.. కోహ్లీతో కలిసి శుభ్‌మన్ గిల్ ఆచి తూచి ఆడాడు.
మూడో వికెట్‌కు 27 పరుగులు జోడించిన అనంతరం శుభ్‌మన్ గిల్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ డకౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఐదో వికెట్‌కు 43 పరుగులు జోడించిన అనంతరం రాహుల్(8) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
ఈ వికెట్ భారత ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది. తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(0), జస్‌ప్రీత్ బుమ్రా(0), మహమ్మద్ సిరాజ్(0), ప్రసిధ్ కృష్ణ(0) ఒక్క పరుగు కూడా జోడించకుండా వెనుదిరిగారు. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీ సైతం క్యాచ్ ఔటయ్యాడు. టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల ఆధిక్యం లభించింది.