
కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ
కేన్ విలియమ్సన్ స్మార్ట్ కెప్టెన్సీ జట్టు విజయాలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. చెప్పుకోదగ్గ ఆటగాళ్లు జట్టులో లేకున్నా.. అందుబాటులో ఉన్నవారితో కేన్ మామ అద్భుత ఫలితాలను రాబడుతున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్ స్పాట్ ఆన్ ఉంటుంది.
మ్యాచ్ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ ఆటగాళ్ల ప్రదర్శన మెరుగయ్యేలా కెప్టెన్‌గా జాగ్రత్త తీసుకుంటున్నాడు. వేగవంతమైన బంతులు వేస్తున్న ఉమ్రాన్ మాలిక్ ఆరంభంలో పవర్ ప్లే బౌలింగ్ చేసి ధారళంగా పరుగులిచ్చాడు. దాంతో అతన్ని పవర్ ప్లే అనంతరం బౌలింగ్ చేయిస్తూ పరుగులివ్వకుండా కట్టడి చేస్తున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఉమ్రాన్ మాలిక్.. పవర్ ప్లే అనంతరమే బౌలింగ్ చేశాడు.

సమష్టి విజయం
సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన నాలుగు విజయాలు సమష్టి కృషి వల్లనే. ఏ ఒక్కడి దయా దాక్షిణ్యాల వల్లనో కాకుండా విజయంలో ప్రతీ ఆటగాడి పాత్ర ఉంటుంది. ముందుగా బౌలర్లు తమ కట్టడైన బంతులతో సాధారణ స్కోర్‌కు పరిమితం చేస్తే.. ఆ తర్వాత బ్యాటర్లు తలో కొన్ని పరుగులు చేస్తూ విజయాన్నందిస్తున్నారు. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమష్టిగా రాణిస్తుండటంతోనే సన్‌రైజర్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది.

ఒత్తిడి లేకుండా చేస్తున్న ఓపెనర్లు
స్టార్ ఓపెనర్లు లేకపోవడంతో సన్‌రైజర్స్.. కెప్టెన్ కేన్ మామతో పాటు అభిషేక్ శర్మలను ఓపెనర్లుగా ఆడిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన ఈ ఇద్దరూ తర్వాతి మ్యాచ్‌ల్లో లయ అందుకున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో ఫామ్ అందుకున్నారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడుతున్నా.. లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్లు నమోదు చేస్తున్నా.. వికెట్ మాత్రం త్వరగా ఇచ్చుకోవడం లేదు. కనీసం 8 ఓవర్ల వరకు క్రీజులో నిలదొక్కుకొని ఉండటంతో తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్ ఒత్తిడి లేకుండా స్వేచ్చగా చెలరేగుతున్నారు.

మిడిలార్డర్ రాణిస్తుండటం..
ఇక రూ.10.75 కోట్లకి కొనుగోలు చేసిన పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ సన్‌రైజర్స్ చిన్న మార్పు చేసింది. మ్యాచ్ గమనానికి అనుగుణంగా అతడ్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి పంపుతూ వస్తోంది. దాంతో.. అతని కంటే ముందు బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠి, మర్‌క్రమ్ స్వేచ్ఛగా ఆడేస్తున్నారు. అబ్దుల్ సమద్, రొమారియో షెఫర్డ్‌పై వేటుతో పూరన్‌లో కూడా జాగ్రత్త పెరిగింది. తొలి రెండు మ్యాచ్‌ల తరహాలో బ్యాట్‌ని అడ్డదిడ్డంగా ఊపేయడం లేదు.
మర్‌క్రమ్ జోరు మీదున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. త్రిపాఠి, మర్‌క్రమ్ రాణిస్తుండటంతో అటు ఓపెనర్లు ఇటు తర్వాతి వచ్చే బ్యాటర్లు స్వేచ్చగా ఆడుతున్నారు. హైదరాబాద్ గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో మార్క్‌రమ్, త్రిపాఠిలో ఎవరో ఒకరు చివరి వరకూ క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించారు.

బౌలింగ్ మెరుగవ్వడం
సీజన్ ఆరంభంలో తడబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బలం మ్యాచ్ మ్యాచ్‌కు పుంజుకుంది. రొమారియో షెఫర్డ్ స్థానంలో మార్కో జాన్సెన్‌ను జట్టులోకి తీసుకోవడం మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఎడమచేతి వాటం పేసరైన జాన్సెన్, మరో లెప్ట్ హ్యాండర్ టి.నటరాజన్‌తో కలిసి ప్రత్యర్థి బ్యాటర్లతో ఆడేసుకుంటున్నాడు. సీనియర్ల సపోర్ట్‌తో ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా లయ అందుకోవడంతో.. భువనేశ్వర్ కుమార్ పని సులువైంది.
ఈ నలుగురు పేసర్లు విసిరిన పదునైన యార్కర్లని అడ్డుకునేందుకు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ తెగ ఇబ్బంది పడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ గాయం జట్టుకు తీరని నష్టం అయినా.. పేసర్లు అతని లేని లోటు తీరుస్తున్నారు.

టాస్ గెలవడం
ఇక సన్‌రైజర్స్ నాలుగు విజయాలకు టాస్ గెలవడం కలిసొచ్చింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన కేన్ మామ మరో ఆలోచన లేకుండా ముందు ఫీల్డింగ్ తీసుకొని ఫలితాన్ని రాబట్టాడు. మైదానంలోని పరిస్థితులను అందిపుచ్చుకున్నాడు. తొలుత ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను సాధారణ స్కోర్‌కు పరమితం చేసి తర్వాత లక్ష్యాన్ని బట్టి బ్యాటింగ్ చేసి విజయాలందుకుంది.


Click it and Unblock the Notifications
