IPL 2021: ఫైవ్ టైమ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను వెంటాడుతున్న చెత్త రికార్డు!

హైదరాబాద్: రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, పాండ్యా బ్రదర్స్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. ఇలా ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల టీమ్‌లో సగం మంది ముంబై ఇండియన్స్ టీమ్‌లోనే ఉన్నారు. వీళ్లకు తోడు షార్ట్ ఫార్మాట్ స్పెషలిస్ట్ కీరన్ పోలార్డ్, సౌతాఫ్రికా డేరింగ్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్.. న్యూజిలాండ్ స్పీడ్‌స్టార్ ట్రెంట్ బౌల్ట్‌లతో ముంబై పర్‌ఫెక్ట్ టీ20 ప్యాకేజీ అనొచ్చు.
అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‌గా నిలిచింది. ఈ లీగ్‌ను ముంబైను విడదీసి చూడలేం. ఎందుకంటే ఆ జట్టు ఏకంగా 5 ట్రోఫీలను కైవసం చేసుకుంది. 2013 నుంచి ఫైనల్‌కు వెళ్లి ప్రతిసారి టైటిల్‌తో తిరిగొచ్చింది. లీగ్‌లో ఎక్కువ మ్యాచ్‌లు(203) ఆడి ఎక్కువ విజయాలు సాధించిన జట్టు కూడా ఇదే.

ముంబైకి మాయని మచ్చలా
ఇంతటి ఘన చరిత్ర ఉన్న ముంబైని ఓ చెత్త రికార్డు వెంటాడుతుంది.. గత 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఒక్కసారి కూడా 200+ పరుగుల లక్ష్యాన్ని అధిగమించలేదు. అవును గత 13 ఏళ్లలో ముంబైకి మొత్తం ఏడు సార్లు 200 ప్లస్ స్కోర్ టార్గెట్స్‌ను చేజ్ చేసే చాన్స్ రాగా.. ఈ ఏడు సార్లు జట్టు ఓటమి చవిచూసింది. లీగ్‌లో ఇంతటి ఘన చరిత్ర ఉన్న ముంబైకి ఇది ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో ఉండగా.. ముంబై, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి స్థానంలో ఉన్నాయి.

ఆర్‌సీబీ సైతం..
లీగ్‌లో ఒక్కసారి టైటిల్ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్(పీకేఎస్), ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) సైతం ఒక్కోసారి 200 ప్లస్ లక్ష్యాన్ని అధిగమించాయి. కానీ ఫైవ్ టైమ్ చాంపియన్ అయిన ముంబై ఈ ఘనతను అందుకోకపోవడం అభిమానులను విస్మయ పరుస్తోంది. ఈ జాబితాను పరిశీలిస్తే.. సీఎస్‌కే మూడు సార్లు 200+ స్కోర్స్ చేజ్ చేయగా.. ఐదు సార్లు మాత్రం చేతులెత్తేసింది. ఆ తర్వాత కింగ్స్ పంజాబ్ మూడు సార్లు అధిగమించి.. 12 సార్లు ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ రెండు గెలిచి, 5 మ్యాచ్‌ల్లో ఓడింది.
కేకేఆర్ 6సార్లు ఓడి ఒక్కసారి 200 ప్లస్ స్కోర్ అధిగమించగా.. ఆర్‌సీబీ ఒక్కసారి ఛేజ్ చేసి.. 10 సార్లు చేతులెత్తేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి గెలిచి.. 11 సార్లు ఓటమిపాలైంది. ఇక హైదరాబాద్, ముంబై ఒక్కసారి కూడా 200 ప్లస్ స్కోర్‌ను చేజ్ చేయలేకపోయాయి. హైదరాబాద్ 5 సార్లు ఓడగా.. ముంబై ఏడు సార్లు ఓటమి చవిచూసింది.

ఆర్‌సీబీపై.. గెలిచినట్టే..
ఇక గత సీజన్‌లో ఆర్‌సీబీపై 200+ స్కోర్ మ్యాచ్‌లో గెలిచినట్టే కనిపించిన ముంబై.. చివరకు థ్రిల్లింగ్ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 201 రన్సే చేసింది. దాంతో సూపర్ ఓవర్‌కు దారితీయగా.. ఆర్‌సీబీ విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో ముంబై ఏడు పరుగులే చేయగా.. ఆర్‌సీబీ 11 రన్స్ చేసి గెలుపొందింది. మరీ ఈసారైనా ఆ అప్రతిష్టను ముంబై తొలిగించుకుంటుదో లేదో చూడాలి.!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications