IPL 2027: ఆ ఐదుగురు ఔట్.. ముంబై ఇండియన్స్ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపర్చింది. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పదింటిలో ఓడింది. దాంతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది.
ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌కు ఇది ఏ మాత్రం తగిన ప్రదర్శన కాదు. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ వైఫల్యం ముంబై పతనాన్ని శాసించింది. ఈ పరాజయం నేపథ్యంలో ముంబై తమ జట్టును ప్రక్షాళన చేయనుంది.
ఐపీఎల్ 2027 మినీ వేలం ఈ ఏడాది నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ తొలి వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ మినీ వేలానికి ముందు జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను ముంబై వదిలేయనుంది. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు ఓ ఐదుగురి ఆటగాళ్లకు ముంబై గుడ్‌బై చెప్పనుంది.

1. హార్దిక్ పాండ్యా
ముంబై పేలవ ప్రదర్శనకు కెప్టెన్‌గా బాధ్యత తీసుకుంటూ ఆ జట్టును వీడేందుకు హార్దిక్ పాండ్యా సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ముంబై జట్టులో మానసిక ప్రశాంతత కరువైందని హార్దిక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకుంది.
జట్టు భవిష్యత్తు కోసం రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కానీ ఈ నిర్ణయం ముంబై కొంపముంచింది. అభిమానులతో పాటు ఇతర ఆటగాళ్లు హార్దిక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. సీనియర్ ఆటగాళ్ల నుంచి కూడా అతనికి సహకారం కొరవడింది. చివరకు ఆ సీజన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై.. ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్ చేరినా.. ఐపీఎల్ 2026 సీజన్‌లో అదే పేలవ ప్రదర్శనను పునరావృతం చేసింది.
2. ట్రెంట్ బౌల్ట్..
న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌పై కూడా ముంబై వేటు వేయనుంది. ఒకప్పుడు తన బౌలింగ్‌తో ముంబైకి చిరస్మరణీయమైన విజయాలు అందించిన బౌల్ట్.. ఈ సారి మాత్రం నట్టేట ముంచాడు. అతన్ని రూ.12.50 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేయగా.. 5 మ్యాచ్‌ల్లో 11.63 సగటుతో 2 వికెట్లు మాత్రమే తీసాడు. ట్రెంట్ బౌల్ట్ వైఫల్యం.. జస్‌ప్రీత్ బుమ్రాపై కూడా ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే ట్రెంట్ బౌల్ట్‌కు ముంబై గుడ్‌బై చెప్పనుంది.
3. సూర్యకుమార్ యాదవ్
స్టార్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ముంబై వదులుకునే అవకాశం ఉంది. రూ.16.35 కోట్ల భారీ ప్రైజ్ ట్యాగ్‌తో జట్టులో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ గతేడాదిన్నరగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ 11 మ్యాచ్‌ల్లో 17.33 సగటుతో 195 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు.
మిడిలార్డర్‌లో అతని వైఫల్యం ఇతర బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని క్రియేట్ చేసి జట్టు పతనాన్ని శాసించింది. ఈ క్రమంలోనే సూర్యకు ముంబై ఇండియన్స్ గుడ్‌బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మినీ వేలానికి ముందు అతను ఫామ్ అందుకుంటే తప్పా.. అతను జట్టులో కొనసాగే పరిస్థితి లేదు.
4. మయాంక్ మార్కండే..
లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన మయాంక్ మార్కండేను కూడా ముంబై వదులకోవచ్చు. అతని స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మయాంక్ మార్కండే ఒక్క వికెట్ తీయలేకపోయాడు.
5. దీపక్ చాహర్..
దీపక్ చాహర్‌ను కూడా ముంబై వదులుకునే అవకాశం ఉంది. రూ.9.25 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ ట్యాగ్‌తో కొనసాగుతున్న దీపక్ చాహర్.. ఒకప్పటిలా రాణించలేకపోతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన అతను 8 వికెట్లు మాత్రమే తీసాడు. అతని చెత్త బౌలింగ్ కారణంగానే ముంబై కొన్ని మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. శార్దూల్ ఠాకూర్ జట్టులో ఉండటంతో దీపక్ చాహర్‌ను వదులుకోవడమే ఉత్తమమని ముంబై భావిస్తోంది. గతంలోలా సత్తా కలిగిన యువ ఆటగాళ్లను గుర్తించి మళ్లీ పూర్వవైభవం అందుకోవాలనే లక్ష్యంతో ముంబై ఇండియన్స్ ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

