For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: ఆ ఐదుగురు ఔట్.. ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా నిరాశపరిచింది. టోర్నీ ఫస్టాఫ్‌లో వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 15 పాయింట్స్‌తో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. తొలి 8 మ్యాచ్‌ల్లో 6 గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. తర్వాత 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిపోవడంతో పాటు ఓ మ్యాచ్ రద్దయ్యింది. కీలక సమయంలో ఆటగాళ్లు తడబడటం.. గాయాలతో దూరమవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ విజయవకాశాలు దెబ్బతీసింది.

ఈ క్రమంలోనే జట్టు బలహీనతలను అధిగమించి వచ్చే ఏడాది సత్తా చాటాలని ఢిల్లీ భావిస్తోంది. ఐపీఎల్ 2026 మినీవేలానికి ముందు జట్టును ప్రక్షాళన చేయనుంది. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదిలేయనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసే ఆటగాళ్ల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం.

5 Players DC Likely to Release Ahead of IPL 2026 Mini-Auction

1. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్

ఐపీఎల్ 2024 సీజన్‌లో జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఢిల్లీ మేనేజ్‌మెంట్ అతనిపై కోట్లు కుమ్మరించింది. మెగా వేలంలో రూ. 9 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం ఐపీఎల్ 2025 సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. 6 మ్యాచ్‌ల్లో 105.77 స్ట్రైక్‌రేట్‌‌తో 55 పరుగులు మాత్రమే చేసాడు. బ్యాటింగ్ టెక్నిక్‌లోని లోపం ప్రత్యర్థులు పసిగట్టడంతో ఈ ఆస్ట్రేలియా యువ ఓపెనర్‌ చేతులెత్తేసాడు. టోర్నీ మధ్యలో జేక్ ఫ్రేజర్ మెక్‌‌గర్క్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతన్ని వదిలేసి మరో కత్తిలాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలని ఢిల్లీ భావిస్తోంది.


2. దుష్మంత చమీర

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ దుష్మంత చమీర తీవ్రంగా నిరాశపరిచాడు. 6 మ్యాచ్‌ల్లో 11.40 ఎకానమీతో 4 వికెట్లు మాత్రమే తీసాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలోనూ అతను తేలిపోయాడు. మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో పేసర్‌ను కొనుగోలు చేసే ఆలోచన ఢిల్లీ మేనేజ్‌మెంట్ చేయవచ్చు.

3. మొహిత్ శర్మ

గుజరాత్ టైటాన్స్ ‌తరఫున మెరుగైన ప్రదర్శన చేసిన వెటరన్ పేసర్ మోహిత్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ ఏరి కోరి తీసుకుంది. మెగా వేలంలో అతని కోసం రూ.2.20 కోట్లు ఖర్చు చేసింది. అతను మాత్రం 7 మ్యాచ్‌ల్లో 10 ఎకానమీతో రెండు వికెట్లు మాత్రమే తీసాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలో అతన్ని వదిలేసి సత్తా కలిగిన టీమిండియా పేసర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.

4. ఫాఫ్ డు ప్లెసిస్

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఫాఫ్ డు ప్లెసిస్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల కనీస ధరకే దక్కించుకుంది. అనుభవం కలిగిన ఓపెనర్‌గా.. జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తాడని ఆశించింది. కానీ అతను మాత్రం 9 మ్యాచ్‌ల్లో 120.94 స్ట్రైక్‌రేట్‌తో 202 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. వచ్చే ఏడాదికి డుప్లెసిస్ వయసు 41 ఏళ్లకు చేరనుంది. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి కత్తిలాంటి ఓపెనర్‌ కోసం ఢిల్లీ ప్రయత్నించవచ్చు. అక్షర్ పటేల్ గైర్హాజరీలో ఫాఫ్ డుప్లెసిస వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

5. టీ నటరాజన్

ఐపీఎల్ 2025 మెగా వేలంలో యార్కర్ల స్పెషలిస్ట్ టీ నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతని పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేసింది. టీమ్ కాంబినేషన్‌లో సెట్ అవ్వకపోవడంతోనే పక్కన పెట్టామని ముందుగా చెప్పిన ఢిల్లీ.. ఆ తర్వాత గాయంతో బాధపడటంతోనే అవకాశం ఇవ్వలేదని మాట మార్చింది. కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నటరాజన్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ సీజన్‌లో అతను 18 బంతులు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. ఆయన ఒక్కో బంతికి దాదాపు రూ. 60 లక్షలు తీసుకున్నాడు. నటరాజన్ సేవలను అవసరం లేవని ఢిల్లీ భావిస్తే అతన్ని వదులుకునే ఛాన్స్ ఉంది.

Story first published: Monday, June 9, 2025, 14:53 [IST]
Other articles published on Jun 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+