
మళ్లీ అదే టాప్ 4 ఎందుకు?
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అట్టర్ ఫ్లాఫ్ అయిన టాప్ 4 బ్యాటర్లనే అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. మళ్లీ రాహుల్, రోహిత్ ఓపెనింగ్ చేయనుండగా.. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మూడు, నాలుగు స్థానాల్లో ఆడనున్నారు. ఈ నలుగురు గతేడాది దారుణంగా విఫలమయ్యారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లేకపోవడం కూడా టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. గతంలో ఆచితూచి ఆడిన టీమిండియా ఇప్పుడు కొత్తగా దూకుడు మంత్రం జపిస్తోంది. ఇదొక్కటి మినహా టాపార్డర్‌లో పెద్దగా మార్పేమి లేదు. ఆసియాకప్ 2022లో రోహిత్, రాహుల్ పాకిస్థాన్‌పై పవర్ ప్లేలోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఫామ్‌లోకి వచ్చారు. సూర్య హాంగ్ కాంగ్‌పై 250 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో 60 పరుగులు చేశాడు. కోహ్లీ అయితే మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. సెంచరీ బాదేసాడు. అయితే ఇదే జోరును ఈ నలుగురు టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సూర్య చిన్నదేశాలపై మినహా పెద్ద జట్లతో ఆడటం లేదు. మరీ ఈ సమస్యను అతను అధిగమిస్తాడో లేదో చూడాలి.

బుమ్రా, హర్షల్ ఫిట్‌నెస్‌పై సందేహాలు..
గాయాలతో ఆసియాకప్ 2022 టోర్నీకి దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్.. పూర్తిగా కోలుకొని టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ ఇద్దరి గైర్హాజరీలో టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులివ్వడంతో ఆసియాకప్ ఫైనల్ చేరకుండానే ఇండియా ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలో ఈ ఇద్దరి రాకతో జట్టు బౌలింగ్ బలం పెరుగనుంది. కానీ గాయాల అనంతరం బుమ్రా, హర్షల్ అదే జోరును కొనసాగించగలరా? అనే సందేహాలున్నాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ల్లో వీరు ఈ సందేహాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

అక్షర్ పటేల్, దీపక్ హుడాలో ఎవరికి చోటు దక్కేది?
మొకాలి గాయంతో జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను టీమ్‌మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. అతన్ని స్పిన్ ఆల్‌రౌండర్‌గా పరిగణించిన మేనేజ్‌మెంట్.. దీపక్ హుడాను బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకుంది. టీ20ల్లోకి అరంగేట్రం చేసి నుంచి హుడా దుమ్మురేపాడు. 9 మ్యాచ్‌ల్లో 156 స్ట్రైక్‌రేట్‌తో 293 పరుగులు చేశాడు. మరోవైపు అక్షర్ పటేల్ సైతం మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు. జడేజాలా లోయరార్డర్‌లో మెరుపులు మెరిపించగలడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరిలో ఎవరూ చోటివ్వాలనేది తేల్చాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉంది.

అశ్విన్ ఎందుకు?
ఐపీఎల్ 2022లో సత్తా చాటి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన యుజ్వేంద్ర చాహల్ కీలక ఆసియాకప్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అతను ఆస్ట్రేలియాతో సిరీస్‌లో సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు అశ్విన్ కూడా తనను ఎందుకు ఎంపిక చేశారో అనేదానికి ఆటతో సమాధానం చెప్పాల్సి ఉంది. లెఫ్టాండర్స్‌ను కట్టడి చేసేందుకే అశ్విన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో అతను ఎలా రాణిస్తాడో చూడాలి.

రిషభ్ పంత్? దినేశ్ కార్తీక్?
ఇక దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్‌ల్లో ఎవరిని వికెట్ కీపర్‌గా ఎంచుకోవాలనేదానిపై కూడా టీమ్‌మేనేజ్‌మెంట్ క్లారిటీకి రావాల్సి ఉంది. ఆసియాకప్ 2022లో కార్తీక్‌కు మొగ్గు చూపిన టీమ్‌మేనేజ్‌మెంట్ జడేజా గైర్హాజరీలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం పంత్‌ను ఎంచుకుంది. కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు. కీలక సమయాల్లో పేలవ షాట్లతో జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలోనే పంత్‌కు బదులు కార్తీక్‌ను ఆడించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌కు కూడా పరిష్కారం చూపాల్సి ఉంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే సిరీస్‌ల్లో ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనేది తేల్చాల్సి ఉంది.


Click it and Unblock the Notifications
