
నలుగురికే చాన్స్..
ఇక ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. 2022 సీజన్ వేలం ముందు గరిష్ఠంగా నలుగురిని రీటెయిన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.
ముగ్గురు భారత ఆటగాళ్లతో ఒక విదేశీ ఆటగాడిని తీసుకోవచ్చు. లేదా ఇద్దరు ఇండియన్ ప్రేయర్స్‌తో పాటు మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. కాగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు వారికి చెల్లించాలి. ఇద్దరిని తీసుకుంటే రూ.12.5 కోట్లు, రూ.8.5 కోట్లు, ఒక్కరినే తీసుకుంటే రూ.12.5 కోట్లు ఇవ్వాలి. ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ.85 నుంచి 90 కోట్లకు పెంచింది.

నో డౌట్.. విరాట్ కోహ్లీ పక్కా...
బీసీసీఐ రిటైన్ పాలసీ ప్రకారం ప్రతీ జట్టులో నలుగురు ఆటగాళ్లే మిగలనున్నారు. ఈ లెక్కన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఎవర్ని తీసుకుంటుందా? అనే ఆసక్తి ఆ ఫ్రాంచైజీ అభిమానుల్లో నెలకొంది. నయా రూల్స్ ప్రకారం ఆర్‌సీబీ ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు మరో ఇద్దరు స్వదేశీ ఆటగాళ్లను తీసుకోనుంది. స్వదేశీ ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకోవడం ఖాయం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా విరాట్.. ఆర్‌సీబీని నడిపిస్తున్నాడు. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు ఒక్క టైటిల్ గెలవకున్నా.. ఇంతటి ఘనమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే దానికి కారణం కెప్టెన్ విరాట్ కోహ్లీనే. కేవలం కోహ్లీ కోసమే ఆ జట్టును అభిమానించేవారున్నారు. కోహ్లీ సైతం చాలా ఇంటర్వ్యూల్లో ఆర్‌సీబీ మినహా ఏ జట్టు తరఫున బరిలోకి దిగనన్నాడు. ఆ పరిస్థితే వస్తే ఐపీఎల్‌కు దూరంగా ఉంటానని చెప్పాడు.

దేవదత్ పడిక్కల్..
స్వదేశీ కోటాలో రెండో ప్లేయర్ దేవదత్ పడిక్కల్.. 2019 సీజన్‌లోనే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన ఈ యువ ఓపెనర్ దుమ్ము రేపాడు. కరోనాతో ఆగిపోయిన ఈ సీజన్‌లోనూ అదరగొట్టాడు. సెంచరీతో చెలరేగాడు. భారత భవిష్యత్తు ప్లేయర్‌గా కనిపిస్తున్న పడిక్కల్‌ను ఆర్‌సీబీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. ఓపెనర్‌గా అతన్ని అంటిపెట్టుకుంటుంది. ఇక ఓ భారత బౌలర్‌ను ఉంచుకోవాలనుకుంటే మాత్రం మహమ్మద్ సిరాజ్‌ను రిటైన్ చేసుకోవచ్చు. కానీ 99 శాంత పడిక్కల్‌ను రిటైన్ చేసుకోవడానికే ఫ్రాంచైజీ మొగ్గు చూపుతోంది.

డివిలియర్స్ డౌట్..
విదేశీ ప్లేయర్ల కోటాలో ఏబీ డివిలియర్స్‌ను రిటైన్ చేసుకోవచ్చు. అయితే అతను ఐపీఎల్ 2022 సీజన్ ఆడుతాడా? లేదా? అనేది సందేహం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఏబీడీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఆటకు దూరమైనా.. తనలోని సత్తా ఏ మాత్రం తగ్గలేదని మిస్టర్ 360 నిరూపించాడు. తనకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓడిపోయే మ్యాచ్‌లను సింగిల్ హ్యాండ్‌తో గెలిపించాడు. డివిలియర్స్ ఫామ్, ఆట గురించి ఎలాంటి డోకా లేదు. కానీ అతను అందుబాటులో ఉంటాడా? లేక గుడ్ బై చెప్తాడా? అనేదే సందేహం. ఐపీఎల్ 2021 సీజన్ ముందు ఏబీడీ టీ20 ప్రపంచకప్ ఆడుతాడని ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో అతను తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది సందేహంగా మారింది. ఉంటే మాత్రం ఆర్‌సీబీ కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది.

మ్యాక్స్‌వెల్/జెమీసన్..
ఇక రెండో విదేశీ ప్లేయర్‌గా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కైల్ జెమీసన్‌ను రిటైన్ చేసుకోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటే జెమీసన్ భవిష్యత్తులో జట్టు కీలకం అవుతాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతని సత్తా ఏంటో యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలిసిందే. తన బౌలింగ్, బ్యాటింగ్‌తో ఈ యువ పేసర్ భారత్ పతనాన్ని శాసించాడు. అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో అతను తన మార్క్ పెర్ఫామెన్స్ కనబర్చలేకపోయాడు. వికెట్లు తీసినా.. దారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ లెక్కన అతన్ని వద్దనుకుంటే ఆర్‌సీబీ మ్యాడ్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోవచ్చు. గత సీజన్‌లో దారుణంగా విఫలమైనా భారీ ధర పెట్టి తీసుకుంది. దాన్ని అతను నిలబెట్టుకున్నాడు. 90 శాతం జెమీసన్‌కే అవకాశాలు ఉంటాయి.


Click it and Unblock the Notifications
