T20 World Cup 2022 ఫైనల్ టర్నింగ్ పాయింట్ అదే.. పాక్ కొంపముంచిన తప్పిదాలు ఇవే..!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 విజేతగా ఇంగ్లండ్ నిలిచింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రెండో సారి విశ్వ విజేతగా నిలిచింది. ఇక 1992 సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆశించిన పాకిస్థాన్‌కు నిరాశే ఎదురైంది. కీలక ఫైనల్లో అనవసర తప్పిదాలతో ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది.
పేలవ బ్యాటింగ్ ఆ జట్టు పతనాన్ని శాసించింది. బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఓ దశలో పూర్తి ఆధిపత్యం చెలాయించారు. కానీ కీలక సమయంలో ఆ జట్టు స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిది గాయపడటం.. ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేయడం పాక్ విజయాన్ని అడ్డుకున్నాయి. ముఖ్యంగా ఓ మూడు కారణాలు పాక్ టైటిల్ గెలవకుండా చేశాయి.

బ్యాటింగ్ వైఫల్యం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ఆరంభంలోనే ఔటవ్వడంతో పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. దాంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 39 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ధాటిగా ఆడలేకపోయారు. ఇక మిడిల్ ఓవర్స్, స్లాగ్ ఓవర్లలో ఆ జట్టు బ్యాటింగ్ మరి దారుణం.
చివరి 9 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 55 పరుగులు మాత్రమే చేసిన ఆ జట్టు.. చివరి ఐదు ఓవర్లలో 2 బౌండరీలు మాత్రమే కొట్టింది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడినా.. స్లాగ్ ఓవర్లలో దంచికొట్టిన ఆ జట్టు 160 ప్లస్ స్కోర్ చేసేది. అప్పుడు ఇంగ్లండ్‌ను కట్టడి చేసే అవకాశం ఉండేది. పాక్ మరో 20 పరుగులు అదనంగా చేసినా ఫలితం మరోలా ఉండేది.

రనౌట్లు చేజార్చడం..
138 పరుగుల లక్ష్యాన్ని కూడా పాక్ బౌలర్లు కాపాడుకునే ప్రయత్నం చేశారు. పవర్ ప్లేలోనే డేంజరస్ హేల్స్, సాల్ట్, బట్లర్‌ను ఔట్ చేసిన పాక్ బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. కానీ వారికి ఫీల్డింగ్ నుంచి సహకారం లభించలేదు. సునాయస రనౌట్లను చేజార్చారు. ఇందులో బెన్ స్టోక్స్‌కే మూడు అవకాశాలు ఇచ్చారు.
కష్టమైన క్యాచ్‌లతో పాటు ఈజీ రనౌట్లు చేయలేకపోయారు. టాప్-3 బ్యాటర్లలా స్టోక్స్‌ను కూడా క్రీజులో కుదురుకోనివ్వకుండా కట్టడి చేసుంటే మ్యాచ్‌పై పాక్ పట్టు సాధించేది. చేయాల్సిన పరుగులు పెరుగుతున్నా కొద్దీ ఇంగ్లండ్ ఒత్తిడికి గురయ్యేది. అప్పుడు బ్యాటర్లు షాట్లు ఆడబోయి వికెట్లు పారేసుకునేవారు. కానీ లైఫ్స్ అందుకున్న బెన్ స్టోక్స్.. అడ్డుగా నిలిచి పాక్ పతనాన్ని శాసించాడు.

షాహిన్ షా అఫ్రిదికి గాయం..
క్రీజులో సెట్ అయిన హారీ బ్రూక్‌ను షాదాబ్ ఖాన్ 13వ ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో షాహిన్ షా అఫ్రిది గాయపడ్డాడు. దాంతో అతను మైదానం వీడాడు. మళ్లీ వచ్చి 16వ ఓవర్ బౌలింగ్ చేసినా.. ఒక్క బంతికే పరిమితమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మైదానం వీడాడు. అతని మిగిలన ఓవర్‌ను ఇఫ్తికర్ అహ్మద్ పూర్తి చేశాడు. ఈ ఓవర్‌లో 4, 6 బాదిన బెన్ స్టోక్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ ఓవర్ గనుక షాహిన్ షా అఫ్రిది వేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. షాహిన్ గైర్హాజరీలో జూనియర్ వసీమ్‌కు బంతినిచ్చిన బాబర్ మూల్యం చెల్లించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications