రువాండా టీనేజ్ సెన్సేషన్, 15 ఏళ్ల ఫ్యానీ ఉటాగుషి మానిండే చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన తొలి ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. నైజీరియాలోని లాగోస్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఇన్విటేషనల్ సిరీస్‌లో ఫ్యానీ ఉటాగుషి ఈ ఫీట్ సాధించింది. ఘనాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన ఫ్యానీ ఉటాగుషి.. 65 బంతుల్లో 17 ఫోర్లతో 111 పరుగులు చేసింది.
మహిళల టీ20 చరిత్రలోనే తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన తొలి క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్లేయర్ కరెన్ రోల్టన్ పేరిట ఉన్న రికార్డును ఉటాగుషి అధిగమించింది. 2005లో కరెన్ రోల్టన్ ఇంగ్లండ్‌పై అరంగేట్ర మ్యాచ్‌లో 96 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. ఫ్యానీ ఉటాగుషి చెరిపివేసింది.

కేవలం 15 ఏళ్ల 223 రోజుల వయసులో సెంచరీ చేయడం ద్వారా, అంతర్జాతీయ టీ20 క్రికెట్ (పురుషులు, మహిళలు కలిపి) చరిత్రలోనే అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలిచింది. గతంలో ఉగాండాకు చెందిన ప్రోస్కోవియా అలకో (16 ఏళ్ల 233 రోజులు) పేరిట ఉన్న రికార్డును ఫ్యానీ బద్దలు కొట్టింది. పురుషుల క్రికెట్‌లో ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్ మెక్కన్ 18 ఏళ్ల వయసులో సెంచరీ చేయడమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రువాండా జట్టు ఫ్యానీ విధ్వంసకర శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 210/3 భారీ స్కోరు చేసింది. ఫ్యానీతో పాటు గిసెల్ ఇషిమ్వే (14), క్లారిస్ ఉవాసే (15), మర్వెయిల్ ఉవాసే (32) రాణించారు. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఘానా జట్టు 88/8కే పరిమితమైంది. దాంతో రువాండా 122 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రువాండా బౌలింగ్‌లో బెలీస్ మురేకటేట్ 3 వికెట్లు తీసి ఘనా పతనాన్ని శాసించింది. ఈ మ్యాచ్‌లో ఫ్యానీ ఉటాగుషిమానిండే అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.