
ఆటగాళ్లు చేసుకునే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఈ సారి వేలం కోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 1097 ఆటగాళ్లు ఈ మెగాలీగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 814 మంది స్వదేశీ ఆటగాళ్లు ఉండగా.. 15 దేశాలకు చెందిన 283 వీదేశీ ఆటగాళ్లు ఉన్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ముగిసిన తర్వాత ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో ఈ మినీ వేలాన్ని నిర్వహించనున్నారు.
విదేశీ ఆటగాళ్లలో వెస్డిండీస్ నుంచి అత్యధికంగా 56 మంది ఉండగా.. ఆస్ట్రేలియా(42), సౌతాఫ్రికా(38), అఫ్గానిస్థాన్(30), న్యూజిలాండ్(29), బంగ్లాదేశ్(5), ఇంగ్లండ్(21), ఐర్లాండ్(2), నేపాల్(8), నెథర్లాండ్స్(1), స్కాట్లాండ్(7), శ్రీలంక(31), యూఏఈ(9),యూఎస్ఏ(2), జింబాబ్వే(2) నుంచి ఆటగాళ్లు దరశాస్తు చేసుకున్నారు. మొత్తంగా క్యాప్డ్(207), అన్క్యాప్డ్(863), అసోసియేటివ్(27)మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో క్యాప్డ్ భారత ఆటగాళ్లు (21), క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు(186), అసోసియేట్(27), కనీసం ఒక్క మ్యాచు ఆడిన అన్క్యాప్డ్ భారత్ ఆటగాళ్లు(50), అన్క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు(2), అన్క్యాప్డ్ భారత క్రికెటర్స్(743), అన్క్యాప్డ్ విదేశీ క్రికెటర్స్(68)మంది ఉన్నారు.
ఇక ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ వేలం కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రిక్ఇన్ ఫో పేర్కొంది. టీ20 వరల్డ్ కప్ కోసం సన్నాహకంగా స్టార్క్ ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాడట. ఆస్ట్రేలియాకు చెందిన మరో పేసర్ జేమ్స్ పాటిన్సన్ కూడా ఐపీఎల్‌పై ఆసక్తిగా లేడంట. గత సీజన్‌లో ముంబైకి ఆడిన ప్యాటిన్సన్ ఈసారి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇక ముంబై ప్యాటిన్సన్‌ను వదులుకున్న విషయం తెలిసిందే. ఇటీవల నిషేధం పూర్తి చేసుకున్న కేరళ క్రికెటర్ శ్రీశాంత్ వేలానికి రూ.75 లక్ష బేస్ ప్రైజ్‌తో దరఖాస్తు చేసుకున్నాడట. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా వేలంలోకి వచ్చాడట.