వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జైస్మీన్ లాంబోరియా, నుపుర్ షెరాన్ దుమ్మురేపారు. అద్వితీయమైన ప్రదర్శనతో ఫైనల్ దూసుకెళ్లి బంగారు పతకానికి అడుగు దూరంలో నిలిచారు. శుక్రవారం జరిగిన మహిళల 57 కేజీల సెమీఫైనల్లో జైస్మీన్ 5-0తో ఒమైలిన్ అల్కాలా(వెనిజువెలా)ను ఓడించింది. ఫైనల్లో ఆమె పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ జులియా(పోలెండ్)తో తలపడనుంది. 80 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో నుపుర్ షెరాన్ 5-0తో డుజ్టస్ సెమ(తుర్కియే)ను చిత్తు చేసింది.
మ్యాచ్ ఆరంభం నుంచి వ్యూహాత్మకంగా ఆడిన నుపుర్ ప్రత్యర్థిపై క్రమం తప్పకుండా పంచ్‌లు విసిరి.. ఆధిపత్యం చెలాయించింది. మరోవైపు మీనాక్షి హుడా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో సెమీఫైనల్ చేరి పతకాన్ని ఖాయం చేసింది. 48 కేజీల క్వార్టర్ ఫైనల్లో అండర్ 19 ప్రపంచ ఛాంపియన్ అలిస్ పామ్‌ఫెరి(ఇంగ్లండ్)ను మీనాక్షి చిత్తు చేసింది. ఈ బౌట్లో తన ఎత్తును అడ్వాంటేజ్‌గా మార్చుకుంది. బ్యాక్‌ఫుట్‌పై ఉంటూ ప్రత్యర్థిపై దాడి చేసింది. బలమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి పంచ్‌లను కాచుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో స్థానం కోసం అల్టాంట్(మంగోలియా)తో భారత బాక్సర్ అమీతుమీ తేల్చుకోనుంది.

మరోవైపు పురుషుల్లో జాదుమణి సింగ్ పోరాటం క్వార్టర్స్‌లోని ముగిసింది. 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ సాన్ జార్(కజకిస్తాన్) చేతిలో జాదుమణి ఓటమిపాలయ్యాడు. దాంతో పురుషుల్లో భారత్ పోరాటం ముగిసింది. 2013 తర్వాత పురుషుల విభాగంలో భారత్ ఒక్క పతకం కూడా సాధించకపోవడం ఇదే తొలిసారి.