బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ బెస్ట్ బాక్సర్ మైక్ టైసన్ మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. బౌట్‌లోకి దిగితే ప్రత్యర్థులపై పంచ్‌లతో విరుచుకుపడే మైక్ టైసన్ 19 ఏళ్ల క్రితం ఆటకు గుడ్‌బై చెప్పాడు. బాక్సింగ్ కింగ్‌గా ప్రసిద్ధి చెందిన మైక్ టైసన్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. తన ఆస్తులను మొత్తం పోగొట్టుకున్నాడు.
దాంతో తన కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమైన నేపథ్యంలో మైక్ టైసన్.. 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాక్సింగ్ ఆడేందుకు ఒప్పుకున్నాడు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో మైక్‌టైసన్ ఆడనున్నాడు. ఈ పోటీలో పాల్గొనేందుకు మైక్‌టైసన్‌కు 20 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నారు.

ఎక్కడ.. ఎలా చూడాలంటే..?
ఈ బౌట్‌లో ప్రముఖ యూట్యూబర్, బాక్సర్ జేక్ పౌల్‌తో మైక్ టైస్ తలపడనున్నాడు. టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్ ఏటీ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం నవంబర్ 16(శనివారం) ఉదయం 6.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇద్దరు బాక్సర్ల వెయిటేజ్ ఈవెంట్ జరగ్గా.. మైక్‌టైసన్ తన ప్రత్యర్థి అయిన జేక్ పౌల్ చెంప చెల్లమనిపించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బాక్సర్లిద్దరినీ అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
27 ఏళ్ల కుర్రాడితో పోటీ..
ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ మ్యాచ్ ప్రమోషన్ కోసమే చెంపదెబ్బ నాటకం ఆడారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. బాక్సింగ్ లెజెండ్‌గా పేరు సంపాదించిన మైక్ టైసన్ 2005లో ఆటకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత వరుసగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాడు.
తాను సంపాదించిన ఆస్తులన్నింటిని పొగొట్టుకున్నాడు. ఎప్పుడూ దూకుడుగా ఉండే టైసన్ దురుసు ప్రవర్తన కలిగిన వ్యక్తి. బాక్సింగ్‌లో 50-6 రికార్డు టైసన్‌పైనే ఉంది. ప్రస్తుతం టైసన్ వయసు 58 ఏళ్లు కాగా.. అతనితో తలపడే పౌల్ వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఏజ్ గ్యాప్ కారణంగా ఇద్దరి మధ్య పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొత్తం 8 రౌండ్లు..
వెయిటేజ్ ఈవెంట్‌లో టైసన్ 228.4 పౌండ్ల బరువు ఉండగా.. 27 ఏళ్ల బాక్సర్ పౌల్ 272.2 పౌండ్ల బరువు ఉన్నాడు. టైసన్ చెంప దెబ్బ కొట్టడం పట్ల తనకు ఎలాంటి బాధ లేదని పౌల్ తెలిపాడు. టైసన్ ఆవేశంతో ఉన్నాడని, చాలా క్యూట్‌గా కొట్టాడని చెప్పాడు. ఈ బాక్సింగ్ బౌట్ మొత్తం 8 రౌండ్లు జరగనుంది. ఒక్కొక్క రౌండ్ రెండేసి నిమిషాల వ్యవధి ఉంటుంది.